
New Delhi, FEB 19: ఫాస్టాగ్‌కు సంబంధించి ఇటీవల ఎన్‌పీసీఐ (NPCI) జారీ చేసిన నిబంధనలపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) క్లారిటీ ఇచ్చింది. జనవరి 28న ఎన్‌పీసీఐ జారీ చేసిన మార్గదర్శకాలు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టంచేసింది. ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ప్రయాణికుల్లో గందరగోళానికి దారి తీసిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా.. స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా లావాదేవీని తిరస్కరిస్తారంటూ ఎన్‌పీసీఐ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే, వాహనం టోల్ ప్లాజాలను దాటినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ స్థితి విషయంలో ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యులర్ జారీ చేసిందని NHAI తెలిపింది.
అలాగే, అన్ని జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలు ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని తెలిపింది. దీని కింద ఫాస్టాగ్ కస్టమర్లు టోల్ ప్లాజాకు చేరుకునేముందు ఎప్పుడైనా రీఛార్జి చేసుకోవచ్చని NHAI తెలిపింది. రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలు మాత్రమే ఐసీడీ 2.4 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని, వాటినీ ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌కు మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. అలాగే, వాహనదారులు తమ ఫాస్టాగ్ వాలెట్‌ను ఆటోమేటిక్‌గా రీఛార్జి చేసుకునేలా యూపీఐ/ కరెంట్/ సేవింగ్స్ ఖాతాతో లింక్ చేసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.