New Delhi, Feb 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేయగా.. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. 2025-26 బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ. 55 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్‌పై సీతారామన్ ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా నిర్మలమ్మ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం 75 నిమిషాలు మాత్రమే (గంటా 15 నిమిషాలు) బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ 12:15కు ముగించారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే రెండో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా (2nd Shortest Budget Speech) చెప్పుకోవచ్చు. గతేడాది (2024) సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్మలమ్మ కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
బడ్జెట్‌ను తొలిసారి 2019లో సభలో ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇక 2020లో నిర్మలమ్మ చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్‌లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్‌ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె ప్రసంగించారు.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాలు ఓ సారి చూస్తే..
2019: 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు)
2020: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు)
2021: 110 నిమిషాలు (గంట 50 నిమిషాలు)
2022: 93 నిమిషాలు (గంట 33 నిమిషాలు)
2023: 87 నిమిషాలు (గంట 27 నిమిషాలు)
2024: (మధ్యంత బడ్జెట్) 56 నిమిషాలు
2024: (పూర్తిస్థాయి బడ్జెట్) 85 నిమిషాలు (గంట 25 నిమిషాలు)
2025 : 75 నిమిషాలు (గంటా 15 నిమిషాలు)
బడ్జెట్ 202-26 సమగ్ర స్వరూపం
రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు
పన్ను వసూళ్లు రూ. 28,37,409 కోట్లు
పన్నేతర వసూళ్లు రూ. 5,83,000 కోట్లు
మూలధనం వసూళ్లు రూ. 16,44,936 కోట్లు
రుణాల రికవరీ రూ. 29 వేల కోట్లు
ఇతర వసూళ్లు రూ. 47 వేల కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు రూ. 15,68,936 కోట్లు
మొత్తం ఆదాయం రూ. 50,65,345 కోట్లు
మొత్తం వ్యయం రూ. 50,65,345 కోట్లు
రెవెన్యూ ఖాతా రూ. 39,44,255 కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ. 12,76,338 కోట్లు
మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ. 4,27,192 కోట్లు
మూలధన ఖాతా రూ. 11,21,090 కోట్లు
వాస్తవ మూలధన వ్యయం రూ. 15,48,282 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 5,23,846 కోట్లు
నికర రెవెన్యూ లోటు రూ. 96,654 కోట్లు
ద్రవ్య లోటు రూ. 15,68,936 కోట్లు
ప్రాథమిక లోటు రూ. 2,92,598 కోట్లు
రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగం – రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ. 2,66,817 కోట్లు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు – రూ. 1,71,437 కోట్లు
విద్యారంగం – రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం – రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం – రూ. 95,298 కోట్లు
ఇంధన రంగం – రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – రూ. 65,553 కోట్లు
సామాజిక, సంక్షేమ రంగం – రూ. 60,052 కోట్లు
శాస్త్ర, సాంకేతిక రంగం – రూ. 55,679 కోట్లు
కేంద్ర బడ్జెట్ (Union Budget) లో మొత్తం 36 రకాల ఔషధాల (Medicines) పై 100 శాతం పన్ను మినహాయింపునిచ్చారు.అత్యవసరమైన చికిత్సలకు ఖర్చును తగ్గించే లక్ష్యంతో 36 రకాల ఔషధాలపై 100 శాతం కస్టమ్ డ్యూటీ మినహాయింపును ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి (Finance Minister) తన 2025-26 బడ్జెట్ (Budget 2025-26) ప్రసంగంలో పేర్కొన్నారు.క్యాన్సర్ రోగులకు ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపుతో అధిక ప్రయోజనం కలుగనుంది.
వేతన జీవులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు.ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.