Death ( Representative image -ANI)

కూతురు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందన్న ఆవేదనను తట్టుకోలేక ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం రద్దయిందన్న షాక్ నుంచి బయటపడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన ర్యాలి శ్రీనివాసరావు (57) రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఆయన భార్య, పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటుండగా, శ్రీనివాసరావు తన తల్లి స్యామవతితో కలిసి విశాఖపట్నంలోని పీఎం పాలెం ప్రాంతంలో నివసిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న కుమార్తెకు, పేందుర్తి సమీపంలోని చినముషిడివాడకు చెందిన బ్యాంకు ఉద్యోగితో గత మార్చిలో వివాహ నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలుగా ఇరువైపుల కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నవంబర్ 25న వివాహానికి శుభముహూర్తం ఖరారు చేసి, బంధుమిత్రులకు శుభలేఖలు పంపించగా, వివాహ వేదిక, విందు, అలంకరణ తదితర అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన

అయితే, అకస్మాత్తుగా వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తెలియజేయడంతో శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతికి గురయ్యారు.వివాహం ఎందుకు రద్దు చేశారనే విషయంలో పూర్తి వివరాలు తెలియకపోయినా, వరుడి కుటుంబం తమ నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అప్పటికప్పుడు స్పందించిన శ్రీనివాసరావు, వరుడి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కలసి పెళ్లి ఆపవద్దని వేడుకున్నారని, కాళ్లావేళ్లాపడ్డారన్న వివరాలు బయటికి వచ్చాయి. అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన కలత చెందారు.

ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు మంగళవారం రాత్రి పెళ్లికి విజయనగరం వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. కానీ రాత్రంతా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బుధవారం ఉదయం పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వీస్ రోడ్డులో నిలిపిన కారును గమనించిన పోలీసులు తనిఖీ చేయగా, కారులో శ్రీనివాసరావు మృతదేహాన్ని కనిపెట్టారు. పక్కనే పురుగుల మందు సీసా కూడా ఉండటం గమనార్హం. ఆత్మహత్యకు ముందు తన కుమారుడికి, బంధువులకు వాట్సాప్ ద్వారా సూసైడ్ నోట్ పంపినట్లు దర్యాప్తులో బయటపడింది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.