Pune Shocker: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక డాక్టర్ దారుణం, భార్యను ఉరితీసి, పిల్లల్ని బావిలో పడేసి, తాను కూడా ఆత్మహత్య, వైద్యుడి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Pune Doctor kills wife: మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పుణె జిల్లాలోని డాండ్ మండలం వార్వాండ్ గ్రామంలో మంగళవారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వార్వాండ్ గ్రామానికి చెందిన పశువుల డాక్టర్ అతుల్ దివేకర్ (42) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.అయితే గత కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా గొడవ జరగడంతో వైద్యుడు అతుల్ దివేకర్ తన భార్యను ఉరితీసి చంపేశాడు. ఆ తర్వాత కొడుకు అద్వైత్, కుమార్తె వేదాంతిని బయటికి తీసుకెళ్లి ఓ బావిలో పడేశాడు.అనంతరం ఇంటికి తిరిగొచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమైందని పుణే పోలీసులు చెప్పారు. అందులో తన భార్య తనను నిత్యం వేధిస్తున్నదని, ఆ వేధింపులు తాళలేకనే తాను ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడాల్సి వచ్చిందని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు.