Bodhan, June 22: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శక్కర్‌నగర్ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కొత్తపల్లి రవీందర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళుతున్న 13 ఏళ్ల బాలికను అడ్డుకున్న ఈ యువకుడు, ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటపెడితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు.నిందితుడు కాంట్రాక్టు ఉద్యోగి కాగా.. అతడి సోదరుడు బీఆర్‌ఎస్ స్థానిక నేత
బోధన్ మండలంలోని ఓ కాలనీలో బాలిక, తన తల్లితో కలిసి ఉంటోంది. ఈ మైనర్ బాలికకు తండ్రి లేకపోవడంతోపాటు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనెల 19న సాయంత్రం తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసేందుకు బాలిక వెళుతుండగా కాలనీ వాస్తవ్యుడు, ఇరిగేషన్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన రవీందర్ గమనించాడు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రవీందర్ ఆ బాలికను వారి ఇంటి సమీపంలోని తన మేకల షెడ్డులోకి లాక్కెళ్లి కాళ్లు, చేతులు బంధించి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బుధవారం కడుపునొప్పి రావడం, అది తీవ్రమవడంతో జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఓ వర్గానికి చెందిన ప్రజలు, రవీందర్ సోదరుడైన బీఆర్‌ఎస్ బోధన్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు.
అయితే రవీందర్‌తో పాటు రాధాకృష్ణ.. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాధితులను బెదిరించారు. దీంతో నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బోధన్ పోలీసుస్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఆందోళనకారులకు పోలీసులు హామీ ఇచ్చారు.పోలీసులు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రవీందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. నిందితుడి సోదరుడు రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలియటంతో ఎమ్మెల్యే షకీల్ దంపతులు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. నిందితుడు రవీందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, అతని సోదరుడు రాధాకృష్ణను కూడా ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.