Pune: ఆ ఇంటిలో ఏం జరిగింది, భీమ నదిలో ఒకే కుటుంబంలోని ఏడు మంది మృతదేహాలు లభ్యం, ఐదుగురిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసిన ఫూణే పోలీసులు
ఈ ఘటనలో ఏడుగురి మృతికి సంబంధించి పోలీసులు ఐదుగురిని (Five Persons Detained) అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు.
Pune, Jan 25: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో గల భీమ నదీగర్భంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది మృతదేహాలు (Bodies of Seven Members of Family Found in Bhima River) కలకలం రేపిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఏడుగురి మృతికి సంబంధించి పోలీసులు ఐదుగురిని (Five Persons Detained) అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు.
మృతుల్లో 40 ఏళ్ల వయసున్న దంపతులు, వారి కూతురు, అల్లుడు, ముగ్గురు మనవళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జనవరి 18 - జనవరి 22 మధ్య నాలుగు మృతదేహాలు కనుగొనగా, పూణె నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ తహసిల్‌లోని యావత్ గ్రామ శివార్లలోని భీమా నదిపై పార్గాన్ వంతెన సమీపంలో మంగళవారం మూడు మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
ఏడుగురి మరణానికి సంబంధించి మేము ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాము. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద నేరం నమోదు చేయబడింది" అని పూణే గ్రామీణ పోలీసు అధికారి తెలిపారు. మృతులను మోహన్ పవార్ (45), అతని భార్య సంగీతా మోహన్ (40), వారి కుమార్తె రాణి ఫుల్‌వేర్ (24), అల్లుడు శ్యామ్ ఫుల్‌వేర్ (28), మూడు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.
భీమా నదీ గర్భంలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు ముందుగా తెలిపారు. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా నీట మునిగి మృతి చెందినట్లు గుర్తించారు. మృతులు మరఠ్వాడా ప్రాంతంలోని బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలకు చెందిన వారని, వీరు కూలీ పనులు చేసుకునేవారని పోలీసులు తెలిపారు.