Andhra Pradesh: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు
ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
Vjy, Sep 25: వైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బీసీ నేత ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు.
‘‘బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని జగన్ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి బాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. బీసీలను కృష్ణయ్య మోసం చేశారు. ఈ ద్రోహంతో ఆర్ కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య.. చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయం అని కారుమూరి అన్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా
జగన్‌కు ఉన్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసమే ఇదంతా. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు.