Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు నేటితో ముగింపు, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 3,970 కి.మీ కు పైగా నడిచిన రాహుల్ గాంధీ
సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన యాత్రకు రాహుల్ ముగింపు పలుకనున్నారు
Srinagar, Jan 30: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నేటితో ముగియనుంది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన యాత్రకు రాహుల్ ముగింపు పలుకనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేత కార్యక్రమంతో ఈ పాదయాత్ర (Rahul Gandhi's Bharat Jodo Yatra) ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 3,970 కి.మీ కు పైగా రాహుల్ గాంధీ నడిచారు.
జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు దేశ వ్యాప్తంగా 23 ప్రతిపక్ష పార్టీలను (Oppn Parties) కాంగ్రెస్ ఆహ్వానించింది. వీటిలో 12 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), తేజస్వీ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి), నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్), ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ మరియు కాశ్మీర్ పీపుల్స్ జమ్ముక్రా పార్టీ (పీడీపీ), ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), సీపీఐ(ఎం), సీపీఐ, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవుతాయి.
టీఎంసీ, ఎస్పీ, టీడీపీ, జేడీయూలకు ఆహ్వానం అందినప్పటికీ ఈ సభకు దూరంగా ఉంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా వారిలో కొందరు ఆహ్వానాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. తన భారత్ జోడో యాత్రతో దేశం దృష్టిని ఆకర్షించిన రాహుల్.. ఈ యాత్ర ద్వారా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారనే వార్తలు వస్తున్నాయి.