AG Perarivalan Granted Bail: రాజీవ్ గాంధీ హత్యకేసు దోషికి బెయిల్, సుప్రీంకోర్టులో ఊరట, విచారణ సమయంలో తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం, సత్ప్రవర్తన కారణంగా బెయిల్ ఇస్తున్నామన్న ధర్మాసనం
ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయన మరికొన్ని రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నారు.
Chennai, March 09: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో (Rajiv Gandhi Case Convict) దోషిగా తేలి, 32 ఏళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏ జీ పెరారివాలన్‌కు (AG Perarivalan ) సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయన మరికొన్ని రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నారు. 47 ఏళ్ల పెరారివాలన్ ఏ జీ పెరారివాలన్(AG Perarivalan).. ఇప్పటికే 32 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. సత్ప్రవర్తన, విద్యార్హత, అనారోగ్యం వంటి కారణాలతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు పడింది. వీరిలో ప్రస్తుతం ఆరుగురు జైలులో ఉన్నారు. పెరారివాలన్ బెయిలు పిటిషన్‌పై ఎల్. నాగేశ్వరరావు, బిఆర్ గవాయి అనే ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు విన్నారు. ఈపిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం..దోషి 30 ఏళ్లకు పైగా జైలులో ఉన్నాడని.. పెరోల్ సమయంలో అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని అందుచేత బెయిల్‌పై విడుదల చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లు వివరించింది.
అయితే పెరారివాలన్ బెయిలు పిటిషన్ విచారణ సమయంలో తమిళనాడు గవర్నర్ పై (Tamilnadu governer)సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించిందని, అయితే రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని పేరారివాలన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి (RN Ravi) వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అపెక్స్ న్యాయస్థానం, విడుదల సిఫారసుపై ఆయనను ప్రశ్నించింది. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు ఏమైనా విచక్షణాధికారం ఉందా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. పెరారివాలన్ బెయిలు పిటిషన్ కు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును దాదాపు రెండున్నరేళ్ల తర్వాత గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. రాష్ట్రపతికి పంపడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు వెళ్లారు. ఈక్రమంలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడి రాజీవ్ గాంధీని హతమార్చింది. ఈఘటనలో ధను, రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) సహా 13 మంది మృతి చెందారు.
భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ నేతపై జరిగిన అతి పెద్ద ఆత్మాహుతి దాడిగా మీడియా పేర్కొంది. ఈఘటనకు సంబంధించి 1999 మే నెలలో పెరారివాలన్, మురుగన్, శాంతమ్ మరియు నళినితో సహా ఏడుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు.