Reserve Bank: ఆర్‌బీఐ కీలక నిర్ణయం, డెబిట్ కార్డుల మాదిరిగానే క్రెడిట్ కార్డుల ద్వారా కూడా యూపీఐ పేమెంట్లు, UPIతో కార్డులు అనుసంధానం చేయబోతున్నామని తెలిపిన గవర్నర్ శక్తికాంత దాస్
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌పేస్ (UPI) వేదికతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి అనుమతించబోతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) చెప్పారు
New Delhi, June 8: రిజర్వ్ బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌పేస్ (UPI) వేదికతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి అనుమతించబోతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) చెప్పారు. ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగానే, భవిష్యత్తులో క్రెడిట్ కార్డులతో కూడా లావాదేవీలను జరపడానికి అవకాశం కలుగుతుంది.
యూపీఐ ప్లాట్‌ఫారంతో క్రెడిట్ కార్డుల అనుసంధానం (RBI allows credit cards to be linked with UPI) గురించి మాట్లాడుతూ, ప్రారంభంలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫారంతో అనుసంధానిస్తామన్నారు. దీనివల్ల వినియోగదారులకు అదనపు సౌకర్యం లభిస్తుందన్నారు. డిజిటల్ పేమెంట్స్ పరిధి పెరుగుతుందని తెలిపారు. యూపీఐ భారత దేశంలో అత్యంత సమ్మిళిత చెల్లింపుల విధానంగా మారిందన్నారు. 26 కోట్ల మంది యూనిక్ యూజర్లు, 5 కోట్ల మంది మర్చంట్స్ ఈ వేదికపై ఉన్నారని తెలిపారు.
యూపీఐ ద్వారా 2022 మే నెలలో దాదాపు 594 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.10.4 లక్షల కోట్లు అని చెప్పారు. ఇక యూపీఐ ప్లాట్‌ఫారంతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం యూజర్ల డెబిట్ కార్డుల ద్వారా పొదుపు/కరెంట్ ఖాతాలతో లావాదేవీలకు యూపీఐ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకోగలిగే స్థితిలో ఉందని దాస్ చెప్పారు. వృద్ధికి ఊతమివ్వడాన్ని కేంద్ర బ్యాంకు కొనసాగిస్తుందని తెలిపారు.