EPFO Users Withdraw Money Via UPI Apps (Credits: X)

New Delhi, March 05: ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్‌డ్రా ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్‌ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్‌ నగదును కూడా విత్‌ డ్రా (EPF Withdraw) చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ (UPI) ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేయాలంటే కొన్ని రోజుల సమయం పడుతోంది. తిరస్కరణకు గురైన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే నగదు విత్‌డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కొద్ది రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. జూన్‌ నాటికి ఈ సదుపాయం రాబోతోందని పేర్కొన్నారు.

Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం 

మరోవైపు యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌తో (NPCI) ఈపీఎఫ్‌ఓ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూన్‌ నాటికి ఈ సదుపాయం కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే జరిగితే ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి పేమెంట్ల యాప్స్‌ ద్వారా నగదును బదిలీ చేసుకోవచ్చు. గరిష్ఠంగా ఎంతమేర ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు? ఏమైనా పరిమితి ఉంటుందా? వంటి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇలా నగదు ఉపసంహరణ సులభతరం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్‌ సొమ్ము చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో చీటికిమాటికీ నగదు వాడుకుంటూ పోతే పీఎఫ్‌ అసలు ఉద్దేశం దెబ్బతినే అవకాశమూ లేకపోలేదు.