RBI on Interest Rates: ఆర్బీఐ కొత్త షాక్, అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయన్న గవర్నర్ శక్తికాంత్ దాస్, ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని వెల్లడి
అంతేకాకుండా, వడ్డీ రేట్లు ఎలివేటెడ్ లెవల్‌లో ఎంతకాలం ఉంటాయో చెప్పలేమన్నారు
కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభం, గ్లోబల్ హెడ్‌విండ్‌ల మధ్య, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్కువగానే ఉంటాయని అన్నారు. అంతేకాకుండా, వడ్డీ రేట్లు ఎలివేటెడ్ లెవల్‌లో ఎంతకాలం ఉంటాయో చెప్పలేమన్నారు. శుక్రవారం కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2023లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. (ఎంత కాలం వరకు) కాలమే చెబుతుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్‌బీఐ విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమన్నారు.
శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ద్రవ్య విధానం యొక్క సవాలు స్వభావాన్ని కూడా నొక్కిచెప్పారు.ఆత్మసంతృప్తికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.ముఖ్యంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు తమ కీలక పాలసీ రేట్లను పెంచాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం దిగువకు వస్తోంది. ఈ సంవత్సరం జూలైలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత గణనీయంగా తగ్గింది.
ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా మే 2022 నుండి స్వల్పకాలిక బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో) సంచితంగా 250 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే, RBI ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రేట్ల పెంపుదలను నిలిపివేసింది. పాత రేట్లనే కొనసాగించింది. రెపో రేటు 6.5 శాతంగా ఉంది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమ్మేళనాన్ని ఉద్దేశించి శక్తికాంత దాస్ మాట్లాడుతూ, జూలైలో దేశీయ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి 7.44 శాతం నుండి క్షీణత సజావుగా కొనసాగడానికి ద్రవ్యోల్బణ విధానాన్ని చురుకుగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్‌బీఐతో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని సూచించారు.
క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు.