Repo Rate Unchanged: మీకు హోంలోన్ ఉందా? అయితే గుడ్‌న్యూస్, రుణగ్రహీతలకు భారీ ఊరట ఇచ్చిన ఆర్బీఐ, రెపోరేటులో మార్పులేదని ప్రకటన
వరుసగా ఆరు పర్యాయాలు రెపో రేటును (Repo rate) పెంచి రుణగ్రహీతలపై భారం మోపిన ఆర్బీఐ...ఈ సారి ఊరట కలిగించింది. కీలకమైన మానిటరీ పాలసీ సమావేశంలో రెపోరేటుపై ఎలాంటి మార్పు చేయొద్దని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.5 శాతంగానే రెపోరేటు ఉండనుంది.
Mumbai, April 06: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. వరుసగా ఆరు పర్యాయాలు రెపో రేటును (Repo rate) పెంచి రుణగ్రహీతలపై భారం మోపిన ఆర్బీఐ...ఈ సారి ఊరట కలిగించింది. కీలకమైన మానిటరీ పాలసీ సమావేశంలో రెపోరేటుపై ఎలాంటి మార్పు చేయొద్దని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.5 శాతంగానే రెపోరేటు ఉండనుంది. అయితే మార్కెట్ వర్గాలు మాత్రం ఈసారి రెపో రేటు పావు శాతం మేర పెరగొచ్చని అంచనా వేశాయి. ఆర్‌బీఐ (RBI) తాజా నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం వద్దనే ఉంది. దీంతో రుణగ్రహీతలను ఊరట లభించింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ గత కొంత కాలంగా రెపో రేటు పెంచుకుంటూ వచ్చింది. రిజర్వు బ్యాంక్ రెపో రేటును గత ఏడాది మే నెల నుంచి పెంచుకుంటూనే వస్తోంది. అప్పటి నుంచి చూస్తే.. రెపో రేటు దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో బ్యాంకులు కూడా ఇదే దారిలో పయనిస్తూ వస్తున్నాయి. రుణ రేట్లు, డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ రెపో రేటు పెంపు కారణంగా హోమ్ లోన్స్ సహా ఇతర రెపో లింక్డ్ రుణ రేట్లు భారీగా పెరిగాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ప్రభావం పడుతోంది.
ఇప్పటికే లోన్ తీసుకున్న వారిపై నెలవారీ ఈఎంఐ పెరుగుతూ వస్తోంది. లేదంటే లోన్ టెన్యూర్ పెరుగుతూ వచ్చి ఉంటుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలన్నా కూడా అధిక వడ్డీ రేటు భారం మోయాల్సి వస్తుంది. ఇలా ఎటు చూసిన రుణ గ్రహీతలపై ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు రెపో రేటు యథాతథంగానే ఉండటంతో రుణ రేట్లు ఇక పెరిగే అవకాశం లేదు.