Bank Loans & EMIs: బ్యాంక్ లోన్లు మరియు ఈఎంఐల వసూళ్లపై మూడు నెలల తాత్కాలిక నిషేధం విధించిన ఆర్బీఐ, వడ్డీల చెల్లింపులకీ వర్తింపు, కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటనలు
వ్యక్తిగత శుభ్రత పాటించండి, సురక్షితంగా ఉండండి. ఈ అంటువ్యాధుల కాలంలో డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడండి అని ఆర్బీఐ గవర్నర్ ప్రజలను కోరారు......
New Delhi, March 27: కరోనావైరస్ వ్యాప్తి (COVID 19) , దేశవ్యాప్త లాక్ డౌన్ (Lockdown) నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అసలే ఆర్థిక మందగమనం ఉన్న సందర్భంలో ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడికి గురిచేస్తుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) శుక్రవారం అన్నారు.
అయితే దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి బలమైన మరియు ఆవశ్యకమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేయాలని అందుకోసం ఆర్బీఐ వాటాదారులు మరియు బ్యాంకులు తమ వంతు సహాకారం అందించాలని ఆర్బీఐ గవర్నర్ కోరారు.
మార్చి 24 నుంచి 26 మధ్య జరిగిన సమావేశాలలో దేశంలోని తాజా పరిస్థితుల సమీక్షించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
ఆర్బీఐ నిర్ణయాలలో ముఖ్యాంశాలు
- ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించారు. రెపో రేటును గణనీయంగా 4.4 శాతానికి తగ్గించారు.
- మార్చి 28, 2020 నుండి నగదు నిల్వ నిష్పత్తి ఎన్‌టిడిఎల్‌లో 100 బిపిఎస్‌ల నుండి 3% కు తగ్గించబడింది.
- అన్ని బ్యాంకులు, రుణ సంస్థలు ఇచ్చిన రుణాల (Loans) పై మూడు నెలల తాత్కాలిక మారటోరియం. దీని ప్రకారం లోన్ల వసూళ్లను తాత్కాలికంగా వాయిదా వేయాలి. అలాగే ఈఎంఐ చెల్లింపుల విషయంలో కూడా 3 నెలల పాటు వినియోగదారులకు ఊరట కల్పించాలి. (** అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం - కొన్ని బ్యాంకులు ఇప్పటికీ నెలవారీగా ఈఎంఐలను మీ ఖాతా నుంచి డిడక్ట్ చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అయితే బ్యాంక్ వారిని సంప్రదించి ఆదాయం తగ్గిందనే విషయాన్ని తెలియజెప్పడం ద్వారా 3 నెలల పాటు ఈఎంఐల మినహాయింపు పొందవచ్చు)
- ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ తిరిగి చెల్లింపులపై మరియు టర్మ్ లోన్లపై విధించే వడ్డీని మూడు నెలల వాయిదా వేయాలి.
- భారీగా అమ్మకాలు దేశీయ మార్కెట్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా మూడు ఏళ్ల కాలానికి మార్కెట్‌లోకి లిక్విడిటీని చొప్పించడానికి ఆర్‌బిఐ రూ. 1 లక్ష కోట్ల వరకు రెపో ఆపరేషన్ చేపట్టనుంది. ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థకుకలిగే భారం రూ. 3.74 లక్షల కోట్లు.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఆర్థిక లోటు తదితర సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆశాజనకంగానే ఉంది. భారతీయ బ్యాంకింగ్ రంగం సురక్షితమైనది మరియు ధృడమైనది అని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ప్రైవేట్ బ్యాంకుల సహా వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులు తమ డిపాజిట్ల భద్రతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. భయాందోళనలతో అవసరం లేని నగదు విత్ డ్రాలు చేపట్టవద్దని సూచించారు. లాక్‌డౌన్‌లో దేశ ప్రజల రోజూ వారి అవసరాల కోసం కేంద్రం రూ. 1.7 లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ
ప్రస్తుతం కోవిడ్ 19 ప్రభావం మనపై ఉంది కానీ త్వరలోనే మనమంతా ఈ ఆపద నుంచి బయటపడతాం. వ్యక్తిగత శుభ్రత పాటించండి, సురక్షితంగా ఉండండి. ఈ అంటువ్యాధుల కాలంలో డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడండి అని ఆర్బీఐ గవర్నర్ ప్రజలను కోరారు.