Mumbai, March 27: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు కీలక వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెపో రేటులో 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న రెపో రేటు 5.15 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించబడింది. అలాగే రివర్స్ రెపో రేటులో కూడా 90 బేసిస్ పాయింట్లు కోత విధిస్తూ 4 శాతానికి తగ్గించారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మరియు దాని తీవ్రత ఇంకెంత కాలం కొనసాగుతుందనే అంశాల మీద భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అన్ని బ్యాంకుల ఈఎంఐ (EMI) లపై మూడు నెలల మారటోరియం
కరోనావైరస్ లాక్ డౌన్ దృష్ట్యా అన్ని బ్యాంకులు మరియు రుణ సంస్థలు ఇచ్చిన రుణాలపై మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధాన్ని అమలు పరచాలి. ఇవన్నీ మూడు నెలల పాటు ఈఎంఐలను స్వీకరించడం తాత్కాలికంగా నిలిపి వేయాలని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి;
ఆర్బీఐ ప్రకటనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10:30 సమయానికి సెన్సెక్ 488 పాయింట్ల లాభంతో 30,435.15 గా కొనసాగుతుంది. అలాగే నిఫ్టీ 201 పాయింట్ల లాభంతో 8,842 గా కొనసాగుతోంది.
కరోనావైరస్ మహమ్మారిపై చేస్తున్న పోరులో భాగంగా దేశంలోని పేదవారి సంక్షేమం దృష్ట్యా గురువారమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ .1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆ మరుసటి రోజే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ కొంత ఊరట కలిగించింది.