Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై రెండో రోజు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు, విచారణలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలని కోరిన కేంద్రం
స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది.
New Delhi, April 19: స్వలింగ వివాహాలకు (Same-Sex Marriages ) చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో మరోసారి విచారణ జరిగింది.స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది.
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తాను ఏప్రిల్ 18న కోరినట్లు బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.
మంగళవారం ప్రారంభమైన ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కోరారు.
అలాకాని పక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు, భయాందోళనలను సేకరించే ప్రక్రియ పూర్తయ్యే వరకు, వాటిని సర్వోన్నత న్యాయస్థానం ముందు సమర్పించే వరకు వేచి చూడాలని, ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మొత్తం మీద 15 పిటిషన్లపై ఈ విచారణ జరుగుతోంది. ఇద్దరు గే జంట పెళ్లి హక్కును అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణలో ఉంది. ప్రత్యేక వివాహ చట్టం క్రింద పెళ్లిని నమోదు చేసుకోవడానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని వీరు కోరారు.
కాగా గతంలోనూ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్రం అభ్యర్థించగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమానత్వం, గౌరవంగా జీవించే హక్కును కల్పించేందుకు స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీంకోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, దీన్ని కేంద్రం వ్యతిరేకించింది. వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత, ఆమోదించిన సామాజిక విలువలను పూర్తిగా దెబ్బతీస్తుందని కేంద్రం అభిప్రాయపడింది.
వివాహ వ్యవస్థకు ఒక పవిత్రత ఉందని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో దీనిని ఒక సంస్కారంగా, పవిత్ర కలయికగా పరిగణిస్తున్నారని పేర్కొంది. భారత్‌లో పురుషుడు, మహిళ మధ్య వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నప్పటికీ, వివాహం తప్పనిసరిగా పురాతన ఆచారాలు, ఆచారాలు, సాంస్కృతిక విలువలు, సామాజిక విలువలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం తెలిపింది.
స్వలింగ వివాహాలపై చర్చ రాష్ట్రాల శాసనసభ పరిధిలోకి వస్తుందని, అందుకే అవి విచారణలో భాగం కావాలని తన వాదన వినిపించింది. అలాగే దీనిపై పది రోజుల్లోగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఈ అంశం శాసనసభ పరిధిలోకి వస్తుంది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు అవసరం. ఈ విషయంపై ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు వివిధ ప్రాంతాల్లోని వర్గాల్లో ఉన్న ఆచారాలు, పద్ధతులు, నిబంధనలు గమనించాల్సి ఉంది. ఒక సమర్థవంతమైన తీర్పు కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోర్టు ఎదుట ఉంచడం ఆవశ్యకం’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.
వివాహం తీరు గత వందేళ్ల నుంచి మారుతూ వస్తోందని, స్త్రీ-పురుష వివాహ బంధం మాదిరిగానే స్వలింగ దంపతులకు సమాన హక్కులుండాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ నిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. మరోపక్క ఇటువంటి వివాహాలకు వ్యతిరేకంగా కేంద్రం వాదనలు వినిపిస్తోంది.