Bilkis Bano Case: గర్భవతిని రేప్ చేసిన ఆ 11 మందిని ఎందుకు విడుదల చేశారు, బిలిస్క్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, పూర్తి వివరాలు ముందుంచాలని ఆదేశాలు
బిలిస్క్ బానో రేపిస్టుల విడుదల విషయంలో సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది
New Delhi, April 18: బిలిస్క్ బానో రేపిస్టుల విడుదల విషయంలో సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.మార్చి 27వ తేదీన సుప్రీంకోర్టు ‘ఇదొక భయంకరమైన ఘటన’ అని, నిందితుల్ని రెమిషన్ మీద ఎందుకు విడుదల చేశారో వివరణ ఇస్తూనే.. ఆ రిలీజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది.
అయితే.. 11 మంది దోషుల శిక్ష ఉపశమనానికి సంబంధించిన పత్రాలను సమర్పించకూడదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు సుప్రీంకు స్పష్టం చేసింది. అంతేకాదు ఒక సాధారణ హత్య కేసులో ఎలాగైతే దోషులకు రెమిషన్ కింద ముందస్తు విడుదల చేస్తామో.. అలాగే ఈ కేసులోనూ చేశామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
ఈ నేపథ్యంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ రెమిషన్ ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. దోషులను ముందస్తుగా ఎందుకు రిలీజ్ చేసిందో తెలపాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ఇవాళ ఈమె. రేపు మరొకరు. దేశంలోని నా సోదర సోదరీమణులకు ఏమి జరుగుతుందో అనే ఖచ్చితమైన ఆందోళన కలుగుతోంది’’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. అయితే.. గుజరాత్, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్.. సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌కు ఆలోచన చేస్తున్నామని, అది దాఖలు చేయాలా వద్దా అన్నది పూర్తిగా నిర్ణయించలేదని కోర్టుకు తెలిపారు.
వెంటనే.. బిల్కిస్ బానో కేసు ఘోరమైన నేరమన్న బెంచ్, రెమిషన్ ప్రకటించేముందు మరో వైపు కూడా ఆలోచించాల్సి ఉండాల్సిందని, ఇది సరైన పద్ధతి కాదని గుజరాత్ ప్రభుత్వం తీరును తప్పు బట్టింది. ఫైల్స్ గనుక కోర్టుకు సమర్పించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అంతా పక్కాగా చేసినప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఒక గర్భవతిని(బిల్కిస్ బానో) గ్యాంగ్ రేప్ చేశారు. గర్భిణిపై సామూహిక అత్యాచారం జరగడంతోపాటు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కేసును సెక్షన్ 302తో సరిపోల్చవద్దు. యాపిల్స్‌కు నారింజ పండ్లతో పోలిక లేనట్లుగా నరమేధాన్ని ఒక్క హత్యతో పోల్చవద్దు.ఇంతటి మారణకాండను సింగిల్ మర్డర్‌గా పోల్చడానికి వీల్లేదు. నేరాలు అనేవి సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానతలను సమానంగా చూడలేము అని కోర్టు అభిప్రాయపడింది.
దేని ఆధారంగా ప్రభుత్వం ఈ విడుదల నిర్ణయం తీసుకుంది? నేడు బిల్కిస్ బానో, రేపు నేను, మీరు.. మరెవరైనా కావచ్చు. రెమిషన్‌కు సంబంధించిన కారణాలు తెలియజేయకుంటే.. మేం సొంతంగా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 2న చేపడతామని తెలిపింది.నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది.
ఇదిలాఉంటే, 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. ఇటీవల వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
(The above story first appeared on LatestLY on Apr 18, 2023 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

