New Delhi, Mar 22: బిల్కిస్ బానో కేసు (Bilkis Bano case)లో నిందితుల ముందస్తు విడుదలపై దాఖలైన పిటిషన్ విచారణకు కొత్త బెంచ్ ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ కేసులో 11 మంది ఖైదీలకు యావజ్జీవ కారాగార విధించగా.. గతేడాది ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం గోద్రా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ విడుదల చేసింది. నిందితుల్లో కొందరు 15 సంవత్సరాలు, మరికొందరు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో తరఫున ఆమె న్యాయవాది శోభా గుప్తా పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా ధర్మాసనం కొత్త బెంచ్ ఏర్పాటుకు పిటిషనర్‌కు హామీ ఇచ్చారు. నిందితుల విడుదలపై విచారణ అవసరమన్నారు. దోషుల విడుదలపై పిటిషన్‌తో పాటు బిల్కిస్ బానో 13 మే, 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకు ముందు బిల్కిస్ బానో డిసెంబర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేసు కథ ఏంటీ
2002 అల్లర్ల సమయంలో గోద్రా రైలును ఆందోళనకారులు తగులబెట్టిన అనంతరం చెలరేగిన అల్లర్లలో బిల్కిన్ బానో లైంగిక దాడికి (Bilkis Bano Gang-Rape Case) గురైంది. ఆ సమయంలో బిల్కిస్ బానో వయసు 21 ఏళ్లు. అప్పటికే ఐదు నెలల గర్భవతి.ఈ అల్లర్లలో బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. ఇందులో మూడేళ్ల కూతురు సైతం ఉన్నది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు విచారణను బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పును ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది 15న నిందితులు విడుదలయ్యారు. నిందితుల ముందస్తు విడుదలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.