Single Charger for All Mobiles: అన్ని ఫోన్లకు ఒకే చార్జర్.. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే.. త్వరలో కేంద్రం కొత్త నిబంధన
పర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా.
Newdelhi, June 24: పర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ (Phone Charging) అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా. ఒక్కో బ్రాండ్ ఫోన్ కు ఒక్కో రకమైన చార్జింగ్ పోర్ట్ ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు, మొబైల్ యూజర్లకు (Mobile Users) పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం రాబోతున్నది. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానున్నది. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్ వరకు డెడ్ లైన్ విధించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటిలోగా స్మార్ట్ ఫోన్ ల కంపెనీలు అన్ని కొత్త ఉత్పత్తులను సీ టైప్ చార్జింగ్ పోర్ట్ తో మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. భారత్ లో మొదట ఈ నిబంధనను 2025 మార్చి నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ గడువు జూన్ కు మార్చింది.
ల్యాప్ టాప్ లకు కూడా
2026 చివరి నుంచి ల్యాప్ టాప్ లను కూడా సీ టైప్ చార్జింగ్ పోర్ట్ తో తయారుచేసేలా నిబంధనను రూపొందించాలని కేంద్రం భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెద్ద సవాల్ గా మారిన నేపథ్యంలో ఒకే రకమైన చార్జింగ్ పోర్ట్ విధానం అమలులోకి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే యాపిల్ సహా చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు టైప్ సీ చార్జింగ్ పోర్ట్ లతో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ నిబంధనను అమలు చేస్తున్నది.