Star Health Data Breach: మీరు స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ వినియోగదారులా? అయితే మీ వ్యక్తిగత డాటా మొత్తం ఇంటర్నెట్ లో ఉంది. ఏకంగా 3.1 కోటి మంది డాటా బహిర్గతం
హ్యాకర్ షెన్‌జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.
Mumbai, OCT 10: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు (Star Health) చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా (data breach) ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్‌జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ హెల్త్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CISO) ఈ డేటాను హ్యాకర్‌కు విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. యూకేకు చెందిన జేసన్ పార్కర్ అనే పరిశోధకుడు సెప్టెంబర్ 20న ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టడం తెలిసిందే.
స్టార్ హెల్త్ కంపెనీకి (Star Health data breach) చెందిన డేటాను షెంజెన్ అనే హ్యాకర్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్లు అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం.
దీనిపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పందిస్తూ.. విచారణకు సీఐఎస్‌వో సహకరిస్తున్నారని, అతడు తప్పు చేసినట్టుగా ఎలాంటి సమాచారం గుర్తించలేదని స్పష్టం చేసింది. సంబంధిత సమచారాన్ని ఎవరూ వినియోగించకుండా మద్రాస్ హైకోర్ట్ నుంచి ఆదేశాలు పొందినట్టు తెలిపింది. స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించింది.