దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో (జనవరి- జూన్) యూపీఐ పేమెంట్స్ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది నమోదైన 51.9 బిలియన్ల తో పోలిస్తే 52శాతం వృద్ధి నమోదైంది.
గతేడాది జనవరిలో యూపీఐ లావాదేవీలు 8.03 బిలియన్ డాలర్లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 13.9 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం సంఖ్యా పరంగానే కాదు విలువ పరంగా రూ.12.98 ట్రిలియన్ల నుంచి రూ. 20.07 ట్రిలియన్లకు దూసుకెళ్లింది. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో యూపీఐ లావాదేవీల విలువ రూ. 116.63 ట్రిలియన్లుగా నమోదైంది. 2023లో నమోదన రూ.83.16 ట్రిలియన్లతో పోలిస్తే 40శాతం వృద్ధితో దూసుకెళ్తోంది.
ఇక యూపీఐ పేమెంట్స్ విభాగంలో ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్‌పే (PhonePe) మొదటి స్థానంలో నిలిచింది. గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. లావాదేవీల మొత్తం విలువలో 81శాతం ఇ- కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, గవర్నమెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉన్నాయి.
యూపీఐ లావాదేవీల యావరేజ్ టికెట్ సైజ్ (ATS) విలువ మొదటి ఆరునెలల్లో రూ.1,603 నుంచి రూ.1,478 తగ్గింది. పర్సన్ టు పర్సన్ (P2P) లావాదేవీల విలువ రూ.2,812 నుంచి రూ.2,836కు పెరిగింది. పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీల విలువ 4శాతం తగ్గింది. రూ.667 నుంచి రూ.643కు తగ్గింది.