New Delhi, Oct 9: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో (RBI Monetary Policy Meeting 2024) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు.మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌కు 8 ఏళ్లు గడిచాయని, సంస్థాగతంగా చోటుచేసుకున్న సంస్కరణ ఇదే అని ఆయన అన్నారు.
ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇక ఎస్‌డీఎఫ్ (సస్టెయినబుల్ డిపాజిట్ ఫెసిలిటీ) రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు ఈ ఏడాది చివరి వరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.
సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, బఫర్ స్టాక్ కూడా కావాల్సినంత ఉందని, దాని వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జీడీపీలో ఇన్వెస్ట్‌మెంట్ షేర్ అత్యధిక స్థాయికి చేరినట్లు చెప్పారు. స్వదేశీ డిమాండ్ పెరగడం వల్ల మాన్యుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలు కూడా తోడ్పడినట్లు వెల్లడించారు.