Mahesh Babu: నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి, పి.గన్నవరంలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్లెక్సీలు, వీడియో ఇదిగో..
ఆ ఫ్లెక్సీలపై మహేశ్ బాబు బొమ్మ... నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి అంటూ ఓ పాప ఫొటో చూడొచ్చు
కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలపై మహేశ్ బాబు బొమ్మ... నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి అంటూ ఓ పాప ఫొటో చూడొచ్చు. రెండు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం మాత్రమే కాదు... హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు.
ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తూ మహేశ్ బాబు తన మంచి మనసును చాటుకుంటున్నారు.ఈ క్రమంలో... 3,772వ శస్త్రచికిత్స కూడా సక్సెస్ అంటూ పి.గన్నవరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫ్లెక్సీల గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి.
పి.గన్నవరంకు చెందిన తాతాజీ-జ్యోతి దంపతులకు రెండేళ్ల పాప ఉంది. రిత్విక అనే ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండడం వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండెకు రంధ్రం పడిందని కార్డియాలజిస్ట్ తెలిపారు.
Mahesh Babu Saved Another Children Heart
శస్త్రచికిత్స తప్పనిసరి అని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, పేద కుటుంబం కావడంతో తాతాజీ, జ్యోతి దంపతులు మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ కు వెళ్లారు. అక్కడ పాపకు నామమాత్రపు ఖర్చుతో ఎంతో ఖరీదైన ఆపరేషన్ ను విజయవంతంగా చేపట్టారు. వారం రోజుల్లోనే ఆ పాప డిశ్చార్జి అయింది. తమ బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చిన తాతాజీ-జ్యోతి దంపతులు మహేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.