Raghu Rama Krishna Raju Bail: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్ట్, ఇకపై మీడియా మరియు సోషల్ మీడియా ముందుకు రాకూడదని ఆదేశాలు

రూ. లక్ష రూపాయల బాండ్ మరియు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ పొందవచ్చునని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో రఘురామకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఆయనకు బెయిల్ అయితే లభించింది కానీ...

File Image of MP Raghu Rama Krishna Raju (Photo:Twitter/RaghuRaju_MP)

New Delhi, May 21:  నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఇరుపక్ష వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం, రఘురామ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. రూ. లక్ష రూపాయల బాండ్ మరియు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ పొందవచ్చునని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో రఘురామకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఆయనకు బెయిల్ అయితే లభించింది కానీ, సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. సీఐడి విచారణకు పూర్తిగా సహకరించాలని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

అలాగే రఘురామ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని మరియు మీడియా ముందుకు గానీ, సోషల్ మీడియా ముందుకు గానీ రాకూడదని ఆదేశించింది. తన గాయాలను మీడియాకు చూపించకూడదని స్పష్టం చేసింది. రఘురామ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీం హెచ్చరించింది.

ఇక, ఎంపీ రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలో విచారించదగినవి కాదని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. ఇక ముందు సీఐడీ ఆయనను విచారించాలనుకుంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే న్యాయవాది ముందే రఘురామ విచారణ చేపట్టాలని సూచించింది.

ఒకవైపు కరోనా కష్టకాలం ఉండగా, ప్రజాప్రతినిధిగా ఉన్న రఘురామ కృష్ణరాజు కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే అభియోగాలపై ఆయనపై ఏపి సీఐడి దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అయితే విచారణలో భాగంగా తనను సీఐడి అధికారులు హింసించారని, ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని రఘురామ తరఫు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. రఘురామ గాయాలు, ఆరోగ్య పరిస్థికి సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వైద్యులు అందించిన మెడికల్ రిపోర్ట్ సుప్రీంకు చేరడంతో న్యాయస్థానం రఘురామ కేసును ఈరోజు విచారించింది. రఘురామ కృష్ణరాజుకు సాధారణ ఎడెమా, బొటనవేలు ప్రాక్చర్, మరికొన్ని గాయాలు ఉన్నాయని మెడికల్ రిపోర్టులో ఉన్న విషయాలను  జస్టిస్ వినీత్ శరణ్ వెల్లడించారు.

దీంతో పోలీసులు రఘురామను కొట్టింది నిజమే అని నిర్ధారణ అయిందని రఘురామ తరఫు న్యాయవాదులు వాదించగా,  ఆ గాయాలు కొట్టడం వల్ల అయినట్లు మెడికల్ రిపోర్టులో ఎక్కడా చెప్పలేదని ఏపి ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు.వాడివేడి వాదోపవాదాల అనంతరం ఎట్టకేలకు ఎంపీ రఘురామకు బెయిల్ లభించింది.

ఇదిలా ఉంటే, ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ఏపి సీఐడీ మరియు  ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన కుటుంబ సభ్యులు లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్, సభాహక్కుల కమిటీకి పంపారు. నివేదిక ఇవ్వాల్సిందిగా హోంశాఖను స్పీకర్ కార్యాలయం కోరింది.