SC on Freebies Plea: ఎన్నికల వేళ ఉచితాలు..దీని సంగతేంటో చెప్పండి, కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ పిటిషన్
రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
New Delhi, Oct 15: ఎన్నికల సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలన్నీ వరుసగా ఉచిత హామీలు గుప్పించడం సర్వసాధారణం అయిపోయింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది శశాంక్ జె శ్రీధర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఉచితాలు ఇస్తామని హామీ ఇవ్వకుండా నిరోధించాల్సిందిగా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఉచితాల వల్ల ప్రభుత్వానికి అధిక భారంగా పరిణమిస్తుందని తెలిపారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పలు కేసులను కూడా ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని న్యాయస్థానం నిర్ణయించింది.
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.ఉచిత హామీలు ఎన్నికల ప్రక్రియను కూడా దెబ్బతీస్తున్నాయని తెలిపారు.