New Delhi, Oct 15: సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్.. అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది.అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ (Predator) డ్రోన్ల కొనుగోలు డీల్‌పై మంగళవారం భారత్ సంతకం చేసింది. ఈ డీల్ కింద మన ప్రభుత్వం మొత్తం 31 ఎంక్యూ9బీ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను కూడా ఈ జనరల్ అటామిక్స్ సంస్థ సమకూర్చనుంది. ఈ మొత్తం 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలినవి వాయుసేనకు కేటాయించనున్నారు. ఈ ఒప్పందం మొత్తం విలువ 3.5 బిలియన్ డాలర్లని తెలుస్తోంది.
అమెరికా ఉత్పత్తిదారుడు జనరల్ ఆటోమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, విదేశీ మిలిటరీ సేల్స్ శాఖ మధ్య కాంట్రాక్టు కుదిరింది. ఈ ఖరీదుకు గత నెలలోనే క్యాబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ దక్కింది.ఆగస్టులో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన బృందానికి డ్రోన్ సామర్థ్యాలను ప్రదర్శించి చూపించారు. ఇప్పటికే పశ్చిమాసియా, అఫ్గాన్ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడారు.
మాజీ మంత్రిపై దుండగుల కాల్పులు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలకలం
చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబిగిన సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. ఇవి నాలుగు హెల్‌ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్‌లో వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది.