Sye Raa Is Not A Biopic: 'సైరా నరసింహా రెడ్డి' అసలు బయోపిక్ కాదు, హైకోర్టుకు తెలిపిన డైరెక్టర్ సురేంధర్ రెడ్డి, సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాలేదు
దీనికి సంబంధించిన కేసు గురువారం హైకోర్ట్ ముందుకు వచ్చింది...
Hyderabad, September 26: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' (Sye Raa Narasimha Reddy) అసలు బయోపిక్ కాదని ఈ చిత్ర దర్శకుడు సురేంధర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. గత కొన్ని రోజులుగా 'ఉయ్యాలవాడ' వంశస్థుల నుంచి సైరా చిత్రంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాత కొణిదెల రామ్ చరణ్ తేజ ఒప్పందం మేరకు తమకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా ఈ సినిమా విడుదల, మరియు సెన్సార్ సర్టిఫికెట్ జారీ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్ లో వారు హైకోర్ట్ ను కోరారు. దీనికి సంబంధించిన కేసు గురువారం హైకోర్ట్ ముందుకు వచ్చింది. విచారణ సందర్భంగా తన వాదనలు వినిపించిన డైరెక్టర్ సురేంధర్ రెడ్డి, ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ కాదని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైరా సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి జారీ చేయలేదని సెన్సార్ బోర్డ్ కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై సోమవారంలోపు నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు సెన్సార్ బోర్డ్ విన్నవించింది. దీంతో కోర్ట్ ఈ కేసుపై తదుపరి విచారణలను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
మరోవైపు ఒడ్డెర కులస్తులు కూడా సైరా సినిమాపై నిరసనలు వ్యక్తం చేశారు. సైరా కేవలం అగ్రకులానికి సంబంధించిన సినిమా అని, నరసింహారెడ్డి కథలో సమానంగా నిలిచిన ఒడ్డెర కులానికి చెందిన 'ఓబన్న' పాత్రను సినిమాలో కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సైరా సినిమాతో దర్శక, నిర్మాతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. Watch Sye Raa The Battlefield Tariler Here.
అయితే ఇన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో అక్టోబర్ 02న సైరా విడుదల అవుతుందా అనేదానిపై సందేహం నెలకొంది. సోమవారం లోపు ఉయ్యాలవాడ వంశస్థులతో సినిమా నిర్మాత రాజీ కుదుర్చుకుంటారా, లేకపోతే మరైదైనా ట్విస్ట్ ఉందా చూడాలి.
సైరా బయోపిక్ కానప్పుడు, కల్పిత కథా?
1857లో మొదలైన తొలి దశ తిరుగుబాటు ఉద్యమానికి 30 సంవత్సరాల ముందే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన రేనాటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం రూపొందిస్తున్నామని, చరిత్ర మరిచిపోయిన భారత తొలి స్వాతంత్య్ర సమరయోధుడిని మళ్ళీ ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీస్తున్నామని ఈ సినిమా యూనిట్ ఆది నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తుంది.
అయితే సినిమా డైరెక్టర్ సురెంధర్ రెడ్డి మాత్రం ఇదసలు బయోపిక్ కాదని నేడు హైకోర్టు తెలపడంతో ఈ సినిమా కథపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. నరసింహా రెడ్డి బయోపిక్ కాని పక్షంలో ఇది కేవలం కల్పిత కథ, ఊహజనిత కథ మాత్రమే అనిపించుకుంటుంది. అలాంటి సందర్భంలో చరిత్రను వక్రీకరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారని ఒక వర్గం వారు చేస్తున్న ఆరోపణలు నిజమే అనే అర్థం వెళుతుంది. అలా కాకుండా, ఉయ్యాలవాడ వారసుల డిమాండ్లను తోసిపుచ్చేందుకే సురేంధర్ రెడ్డి, 'సైరా' సినిమా బయోపిక్ కాదని తెగేసి చెప్పాడా ? లేక, నిజంగానే ఈ సినిమాలో నరసింహా రెడ్డి పేరును మాత్రమే వాడుకొని తనే సొంతంగా కథను సిద్ధం చేశాడా ? ఈ ప్రశ్నలన్నీ తిరిగి డైరెక్టర్ మెడకే చుట్టుకుంటాయి. సినిమా అన్నప్పుడు కొంత కల్పితం జోడించడం సాధారణమే, అయితే బయోపిక్ తీస్తున్నపుడు ఇలాంటి వాటి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి, సైరా కథలో ఇంకెన్ని ట్విస్టులు దాగి ఉన్నాయో. 'సైరా బయోపిక్ కాదు' అనే అంశంపై మీ అభిప్రాయం ఏమిటో సోషల్ మీడియా ద్వారా మాతో పంచుకోండి.