Tollywood Biopics: ఆత్మకథను అంత:కరణ శుద్ధితో తెరకెక్కించాలి! ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బయోపిక్ సినిమాల విశేషాలు
Tollywood Biopic Movies

ఏదైనా కమర్షియల్ సినిమా తీయాలంటే వెంటనే కథ సిద్ధం చేసుకొని షెడ్యూల్ ప్రకటించవచ్చు. కానీ బయోపిక్ (Biopic) తీయాలంటే మాత్రం అది కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. ఆ వ్యక్తికి బయోపిక్ తీసేంత కంటెంట్ ఉండాలి, వారిపై ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. వారి పాత్రలకు సరిపోయే నటీనటులు దొరకడం కూడా ఎంతో కీలకం, ప్రతీ సన్నివేశం జాగ్రత్తగా చిత్రీకరించాల్సి ఉంటుంది.  ఏ చిన్న తప్పు దొర్లినా తర్వాత వారి అభిమానుల నుంచి, న్యాయపరంగా చిక్కులు తప్పవు. బయోపిక్ కోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తైతే ఆ బయోపిక్ ప్రేక్షకులను అలరించేలా ఉండాలి, బయోపిక్ కాబట్టి కల్పితానికి చోటు ఉండదు, వారి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు చూపించాల్సి ఉంటుంది,  అయితే సినిమాటిక్ టచ్ కోసం కథను మార్చకుండా కొన్ని సన్నివేశాలలో కొంతవరకు ఫిక్షన్ జోడించవచ్చు.  అది దర్శకుడి కల్పనాశక్తి, దర్శకత్వ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. కానీ  ఏమాత్రం తేడా వచ్చిన 'కథ అడ్డం తిరుగుతుంది'.

బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి, అయితే టాలీవుడ్ (Tollywood) లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ బయోపిక్ ట్రెండ్ ఊపందుకుంది.

టాలీవుడ్ లో వచ్చిన బయోపిక్స్:

మహానటి

నిన్నటి తరం నటి సావిత్రి గురించి చాలా మందికి ఆమె మంచి నటిగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆన్ స్క్రీన్ లైఫ్ తో పాటు ఆమె ఆఫ్ స్క్రీన్ విషయాలు. సాధించిన విజయాలు, జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు . వెండితెర మహానటిగా వెలిగిన ఆ తార చివరకు అన్నీ కోల్పోయి, ఎవరూ లేని ఓ అనాధగా చనిపోయేవరకు ఎంతో హృద్యంగా, ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఆ మహానాటి సావిత్రితో పాటు ఈ 'మహానటి' బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తాను కూడా ఓ మహానటి అనిపించుకుంది.

NTR బయోపిక్

తెలుగుజాతి ఘనకీర్తి ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం NTR. ఈ సినిమా 2 భాగాలుగా విడుదలైంది. మొదటిది భాగం పేరు కథానాయకుడు. - ఎన్టీఆర్  మామూలు స్థాయి నుంచి తెలుగు తెరపై ఓ మహానటుడిగా, తిరుగులేని శక్తిగా ఎదిగిన తీరును ఈ పార్టులో చూడొచ్చు. రెండో భాగం పేరు మహానాయకుడు. నటుడి నుంచి మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం రాజకీయ క్షేత్రంలో ఓ ముఖ్యమంత్రిగా, మహానేతగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూడొచ్చు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి  నటించారు.

లక్ష్మీ's  NTR

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 'NTR బయోపిక్' కు కౌంటర్ గా , లక్ష్మీ's  NTR - అసలు కథ పేరుతో సినిమా విడుదల చేశారు. ఈ సినిమా ఎన్టీఆర్  రెండో సతీమణి అయిన లక్ష్మీ పార్వతి కోణంలో సాగుతుంది. ఇందులో ఎన్టీఆర్  జీవితంలో జరిగిన చేదు సంఘటనలను ప్రస్తావించారు. NTR సినిమాలో చంద్రబాబు పాత్రను హీరోగా చూపిస్తే, లక్ష్మీ's  NTR సినిమాలో ఆయన పాత్రను నెగెటివ్ గా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు ఎన్నో రకాల వివాదాలకు కారణం అయింది.

రాంగోపాల్ వర్మకు అంతకుముందు రక్తచరిత్ర, వంగవీటి, వీరప్పన్ లాంటి వయొలెంటిక్ సినిమాలను సైతం బయోపిక్స్ గా తీసి సక్సెస్ అయిన చరిత్ర కూడా ఉంది.

యాత్ర

దివంగత నేత డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వై.ఎస్ పాత్రలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. ఆనాడు వై.ఎస్ పాదయాత్ర చేస్తూ, జనాల కష్టసుఖాలను తెలుసుకుంటూ మహానేతగా మారిన ప్రస్థానాన్ని ఈ సినిమాలో చూపించారు.

మల్లేశం

ఇది ఓ సామాన్యుడి బ్రతుకు చిత్రం, చేనేత కార్మికురాలిగా తన తల్లి పడే కష్టాన్ని చూసి,  ఆ కష్టాన్ని ఎలాగైనా దూరం చేయాలని భావించి 'ఆసుయంత్రం' కనుగొని 'పద్మశ్రీ' అందుకున్న  ఓ మామూలు వ్యక్తి చింతకింది మల్లేశం సాగించిన అసామాన్య ప్రయాణాన్ని ఈ సినిమాలో చాలా అందంగా, సహజత్వానికి దగ్గరగా చూపించారు.

సైరా

బ్రిటీష్ వారిపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవితం ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ షహన్ షా అమితాబ్ బచ్చన్ తో పాటు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లాంటి ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు నటించారు.

అయితే సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కథపై, క్యారెక్టర్లపై, మరికొన్ని అంశాలలో వివాదాలు చెలరేగాయి. దీంతో ఇది పూర్తిగా బయోపిక్ చిత్రం కాదని సినిమా డైరెక్టర్ సురేంధర్ రెడ్డి కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

చాలా అరుదుగా వచ్చే ఈ బయోపిక్స్ ఓ గొప్ప ప్రయత్నం అని చెప్పాలి. ఈ బయోపిక్స్ అనేవి తెలియని విషయాలను తెలియపరుస్తూ, గొప్ప గొప్ప చరిత్రలను ప్రస్తుత, భవిష్యత్ తరానికి అందిస్తూ వారిలో స్పూర్థి నింపేందుకు ఉద్దేశింపబడినవి. అందులో ఎలాంటి స్వార్థం గానీ, స్వలాభం కోసం తీసేవి కావు. అయితే తెలుగులో వచ్చిన కొన్ని బయోపిక్స్ రాజకీయ లబ్ది కోసం లేదా ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయడం కోసం ఉద్దేశించి తీసినట్లు విమర్శలున్నాయి. రాజకీయ నేపథ్యం ఉండి, సరిగ్గా ఎన్నికల సమయానికి విడుదలయిన NTR, లక్ష్మీ's NTR, యాత్ర లాంటి చిత్రాలపై అలాంటి విమర్శలే వచ్చాయి.