Taj Mahal's 22 Doors Stay Locked: తాజ్ మహల్ డోర్లు తెరవాలన్న పిటీషనర్‌కు కోర్టు మొట్టికాయలు, రీసెర్చ్ చేయాలంటే చదువుకోండి, కోర్టు టైమ్ వేస్ట్ చేయొద్దంటూ గట్టి వార్నింగ్
ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్‌లో కోరాడు. అయితే, హైకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Allahabad, May 13: తాజ్ మహల్ (Taj mahal) చుట్టూ కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అది ఒకప్పుడు హిందూ దేవాలయమని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక వ్యక్తి ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టులో (Allahabad High Court) పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్‌లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ (Rajaneesh singh) అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్‌లో కోరాడు. అయితే, హైకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ డీ.కే.ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం ఈ పిల్ తిరస్కరించింది. ఇలాంటి అంశాల్ని చర్చించాల్సింది డ్రాయింగ్ రూమ్‌లో అని, కోర్టు రూమ్‌లో కాదని వ్యాఖ్యానించింది.
‘‘ఏదైనా అంశంపై కావాలంటే రీసెర్చ్ చేయండి. దీనికోసం ముందుగా ఎమ్.ఏ. చదవండి. ఆ తర్వాత పీహెచ్‌డీ చేయండి. ఏ యూనివర్సిటీ అయినా, మిమ్మల్ని రీసెర్చ్ చేయనివ్వకపోతే తిరిగి మా దగ్గరికే రండి’’ అని కోర్టు పిటిషనర్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాలు కోర్టులో చట్టం ముందు చర్చించాల్సినవి కావని, దీనికోసం జడ్జీలేం శిక్షణ తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ రోజు తాజ్ మహల్ గురించి అడిగారు. రేపు జడ్జీల చాంబర్ గురించి అడుగుతారు. చట్టం కల్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్ని ఇలా అపహాస్యం చేయకండి’’ అని కోర్టు సూచించింది.
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వివాదాలు చుట్టుముట్టడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్ల తాజ్‌మహల్ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతోంది. తాజ్‌మహల్‌ని మెుఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ ప్రేమకు చిహ్నాంగా చెప్పుకుంటారు. దీన్ని పర్షియన్, ఇండియన్, ఇస్లామిక్ శైలి మేలవించి నిర్మించారు. యుమునా నది ఒడ్డున తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఓ అద్భుతం. అయితే ఈ తాజ్‌మహల్ ముంతాజ్ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. అసలు దీనిపేరు తాజ్‌మహల్ కాదని తేజో మహాలయ అన్న వాదనలు చాలానే ఉన్నాయి. నిజానికి 1666లోనే షాజహాన్ మరణించినా.. వివాదాలు మాత్రం సజీవంగానే మిగిలిపోయాయి. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. నాలుగు అంతస్థుల తాజ్‌మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారు.తాజ్ మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని…అందులో దాగివున్న రహస్యాలను బయటపెట్టాలని… అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు.