Tamil Nadu Rains: కుండ పోత వర్షాలకు తమిళనాడులో 10 మంది మృతి, అత్యవసర సాయం కింద రూ.12 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ విన్నపం
వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Chennai, Dec 20: తమిళనాడు రాష్ట్రాన్ని మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలు ఇంకా తగ్గకపోవడంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
తిరునెల్వేలి, తెన్ కాసి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే రద్దు(South Central Railway) చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. నాగర్‌కోయిల్-కన్నీకుమారి ఎక్స్‌పీఎల్, నాగర్‌కోయిల్-తిరునెల్‌వేలి ఎక్స్‌పీఎల్ పూర్తిగా రద్దయ్యాయి.
పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రాన్నిఈ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యవసర సరకులు అందిస్తున్నారు.
దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు. 24 గంటల్లో తిరునెల్వేలిలో సుమారు 670 మిల్లీమీటర్లు, టుటికోరిన్‌లో 932 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఆ రెండు జిల్లాలకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించినట్లు ఆయన వెల్లడించారు.
తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు సర్వస్వం కోల్పోయారని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.7,300 కోట్లు, శాశ్వత ఉపశమనం కోసం రూ.12 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి విన్నవించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.6వేల సాయం ప్రకటించారు.మౌలిక సదుపాయాల మరమ్మత్తుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుండి రూ. 2,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని అభ్యర్థించారు.
వీడియో ఇదిగో, భారీ వర్షాల్లో చిక్కుకున్న పసిపాపతో సహా నలుగురిని రక్షించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
స్టాలిన్ మాట్లాడుతూ..100 ఏళ్లలో తమిళనాడులో అతివృష్టి వల్ల ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయ నిధి అందించాలి. ఎనిమిది మంది మంత్రులు, 10 మంది IAS అధికారులను రెస్క్యూ ఆపరేషన్ కోసం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాం. SDRFకి చెందిన 15 బృందాలు, 10 NDRF బృందాలు ఇతర బలగాలతో సహాయక చర్యలు చేపట్టాయి. SDRFకి చెందిన 230 మంది పురుషులు 12,553 మందిని రక్షించారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నాం" అన్నారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరునల్వేలి, తెన్‌కాసి, తూత్తుకుడి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బుధవారం కూడా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కోయిల్-కన్యాకుమారి, నాగర్‌కోయిల్-తిరునెల్వేలి స్సెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తామరబరాణి నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షం కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 20,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, సైన్యం రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.