Chennai, Dec 19: భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలం అవుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా తమిళనాడులో మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యక్రమాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను మోహరించారు. గర్భిణీ స్త్రీ, 1.5 సంవత్సరాల వయస్సు గల శిశువుతో సహా నలుగురు ప్రయాణీకులను మదురకు సురక్షితంగా తీసుకెళ్లారు.వారికి సురక్షితంగా తరలిస్తున్న వీడియో ఇదిగో..
వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాల్లో 7500 మందిని ఇప్పటికే రిలీఫ్ క్యాంపులకు తరలించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆర్మీ సహాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలో కాయల్‌పట్టిణం ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి.చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే రైళ్ళను రద్దు చేశారు.
వీడియో ఇదిగో, భారీ వర్షాల్లో చిక్కుకున్న పసిపాపతో సహా నలుగురిని రక్షించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
కొమొరిన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన తుపాను పొరుగు ప్రాంతాలకూ విస్తరిస్తోందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.భారీ వర్షాల కారణంగా కన్యాకుమారి, టెన్‌కాశి రెండు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వం మంగళవారం(డిసెంబర్ 19) కూడా సెలవు ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా వేశారు.
తిరునల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో మొన్నటిదాకా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.
తిరునల్వేలి, కన్నియాకుమారి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాలకు మంగళవారం వరకు రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణ మండల అధికారి బాలచంద్రన్ ప్రకటించారు. కన్నియాకుమారి పరిసర సముద్రతీర ప్రాంతాల్లో వాతావరణ ఉపరితల ఆవర్తనం, ఈశాన్యరుతుపవనాల ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయని తెలిపారు. జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు.
తమిళనాడు భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తూర్పు గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.