Tamil Nadu Rains: అర్థరాత్రి చెన్నైని ముంచెత్తిన భారీ వరదలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Rains in Chennai (Photo-Twitter)

Chennai, Nov 11: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ( Heavy rains lash Chennai) రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం 14 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణీపేట్‌, వెల్లూరు, సాలెం నాగపట్నం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇంతటి వర్షపాతం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పొన్నేరి, అవడి ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

అర్ధరాత్రి భారీ వర్షంతో చెన్నై జలమయం అయ్యింది. రాజధాని చెన్నైలోని పలు కాలనీలు జలమయంకాగా, చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఉత్తర చెన్నైలోని పులియాంతోప్‌లో మోకాళ్ల లోతులో నీళ్లు చేరి.. పలు వాహనాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం పలు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం ఐదువేలకు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా.. అందులో 169 శిబిరాలు చెన్నైలోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు.

రానున్న రెండు రోజులు చెన్నైలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. డెల్టా రీజియన్‌లోని చెన్నై, చెంగల్‌పట్టు, విల్లుపురం, కళ్లకురిచి, ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తీరాన్ని సమీపించే క్రమంలో శనివారం చెన్నైలో వరుణుడు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో సముద్ర తీర జిల్లాలలో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి.

ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. ఇక సముద్రంలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, వేటకు దూరంగా ఉండాలని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం హెచ్చరికలతో రాష్ట్రంలోని పలు సముద్ర తీర జిల్లాలలోని జాలర్లు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలవేర్కాడు తీరంలో ఒకటో నెంబరు తుపాన్‌ ప్రమాద హెచ్చరిక సూచికను ఎగుర వేశారు.

నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు.