Weather Forecast: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
Rainfall -Representational Image | (Photo-ANI)

Vjy, Nov 10: నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా ఏర్పడిన అల్పపీడనం ( LOW PRESSURE AREA,BAY OF BENGAL) మరింత బలపడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (HEAVY RAINS FOR TAMIL NADU AND ANDHRA PRADESH) ఉందని తెలిపింది.

నారా లోకేష్ పర్యటన వేళ ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం, మీ చిల్లర రాజకీయాలు ఆపండి, మా ఇళ్లేమీ కూల్చలేదంటూ ఇళ్లపై బ్యానర్లు

శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని.... కానీ నవంబర్ 11 తర్వాత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబరు 11 నుంచి దక్షిణా కోస్తాంధ్ర భాగాలైన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి నగరాల్లో మొదలై ఆ తర్వాత నుంచి కడప​, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోకి విస్తరించనుంది. అల్పపీడనం ఎఫెక్ట్ నవంబర్ 15 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు.