Tamil Nadu: రూ. 20 లక్షలు అప్పు చేసి ఆన్‌లైన్ రమ్మీ ఆడిన మహిళ, వాటిని తీర్చేలేక చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య, తమిళనాడులో విషాద ఘటన
ఆన్‌లైన్ రమ్మీకి బానిసైన ఓ వివాహిత అప్పుల పాలై బలవన్మరణానికి (Woman kills self) పాల్పడింది.
Chennai, June 7: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలె విషాద ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్ రమ్మీకి బానిసైన ఓ వివాహిత అప్పుల పాలై బలవన్మరణానికి (Woman kills self) పాల్పడింది. తమిళనాడు రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ (losing lakhs in online rummy) బారిన పడి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. ఇందులో అత్యధిక శాతం మంది పురుషులే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ రమ్మీకి బానిసై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం అక్కడ కలకలం రేపింది.
విషాద ఘటన వివరాల్లోకెళితే.. చెన్నై తిరువొత్తియూరు మనలి పుదునగర్ చెందిన భాగ్యరాజ్ కందన్ చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మెగ్రటిక్ (3), నోబల్ గ్రిస్(01) అనే పిల్లలున్నారు. ఏడాది కాలంగా భవాని ఆన్‌లైన్ రమ్మీకి ఆకర్షితురాలైంది. దీంతో భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న నగదును బ్యాంక్‌లో జమ చేసి ఆ గేమ్‌లో మునిగింది. ఇంట్లో ఉన్న 20 సవర్ల నగలను విక్రయించి మరీ గేమ్ ఆడింది. చివరకు తన చెల్లెలు భారతి, కవిత వద్ద నుంచి రూ.3 లక్షల మేరకు అత్యవసరం పేరిట డబ్బు తీసుకుని రమ్మీపై దృష్టి పెట్టింది.
ఈ వ్యవహారం భాగ్యరాజ్ దృష్టికి చేరింది. ఆయన మందలించినా ఫలితం శూన్యం. రెండు రోజులుగా తన సోదరికి ఫోన్ చేసి కొందరి వద్ద తాను అప్పలు చేసినట్టుగా భవాని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తన గదిలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఏడాది కాలంలో రూ. 20 లక్షల మేర కు నగదు జమ కావడం, ఆ మొత్తం ఆన్‌లైన్ రమ్మీకి వాడి ఉండటం వెలుగు చూసింది.