Tata Air India: టాటా చేతికి ఎయిరిండియా ప్రక్రియ షురూ, ఇవాల్టి నుంచే విమానాల్లో టాటా భోజనం, వందశాతం వాటా దక్కించుకున్న టాటా సన్స్
ఈ నెల 27న టాటా సన్స్ గ్రూప్(Tata Son's Group)కు యాజమాన్య బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గురువారం నుంచి ఎయిరిండియా.. టాటా ఎయిరిండియా (Tata Air India)గా అవతరించబోతున్నది. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ 2022 జనవరి 27న చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది
New Delhi, January 27: ఎయిరిండియా (Air India) పుట్టింటికి చేరుకునే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న టాటా సన్స్ గ్రూప్(Tata Son's Group)కు యాజమాన్య బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గురువారం నుంచి ఎయిరిండియా.. టాటా ఎయిరిండియా (Tata Air India)గా అవతరించబోతున్నది. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ 2022 జనవరి 27న చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20 క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్‌ను టాటా సన్స్‌కు అందజేశాం. టాటా సన్స్ (Tata Son's)24న సమీక్షించిన తర్వాత బుధవారం మార్పులేమైనా ఉంటే తెలియజేస్తుంది అని ఎంప్లాయీస్‌కు పంపిన ఈ-మెయిల్‌లో ఎయిరిండియా ఫైనాన్సియల్ డైరెక్టర్ వినోద్ హెజ్మాదీ తెలిపారు. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో ఉద్యోగుల మద్దతు కోరారు. ఇప్పటివరకు అన్ని రకాలుగా మద్దతునిస్తూ అద్భుతంగా పని చేశారని పొడిగారు.
వచ్చే మూడు రోజులు తమ శాఖ పనిపై వత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయడానికి గత మూడు, నాలుగు రోజుల పాటు మెరుగ్గా పని చేయాలి. నిర్ణీత గడువులోగా టాస్క్ పూర్తి చేయడానికి అవసరమైతే రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి మాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నా అని వినోద్ హెజ్మాదీ తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఎయిరిండియాలో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐశాట్స్‌లో 50 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ దాఖలు చేసిన బిడ్‌ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెలాఖరులోగా టాటా సన్స్‌కు ఎయిరిండియా ట్రాన్స్‌ఫర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఎయిరిండియా ట్రాన్స్‌ఫర్ తర్వాత టాటా సన్స్ చేతిలోకి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌లైన్స్ వస్తాయి. ప్రభుత్వం నుంచి ఎయిరిండియా బదిలీ తర్వాత ఏయిర్ఆసియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలను ఎయిరిండియాలో విలీనం చేస్తుంది. ఎయిరిండియా టేకోవర్ తర్వాత దాని ఆపరేషన్స్, సర్వీస్ ప్రమాణాలను మెరుగు పరిచేందుకు టాటా గ్రూప్ 100 రోజుల ప్లాన్‌తో కూడిన బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది.