Tejaswi Yadav on PK: ప్రశాంత్ కిషోర్ కు అన్ని డబ్బులెక్కడివి? బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ మండిపడ్డ తేజస్వీ యాదవ్
Patna, May 24: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు (Prashant Kishor) ఎన్నికల వ్యూహంలో భాగంగా కాషాయ పార్టీ నిధులు సమకూరుస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్‌ను బీజేపీ ఏజెంట్‌గా (BJP agent) ఆయన అభివర్ణించారు. తేజస్వి యాదవ్ శుక్రవారం పట్నాలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఓటమి బాట పట్టడంతో మూడు, నాలుగు దశల పోలింగ్ అనంతరం ప్రశాంత్ కిషోర్‌ను రప్పించారని అన్నారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించానని నితీష్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ప్రకటించినా ఇప్పటి వరకూ అమిత్ షా కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ తోసిపుచ్చలేదని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ మొదటినుంచీ బీజేపీతో సన్నిహితంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జిల్లా అధ్యక్షులకు వేతనాలు చెల్లిస్తూ కొనసాగిస్తున్నారని, బీజేపీ కూడా ఇలా చేయదని తేజస్వి యాదవ్ అన్నారు.
ప్రశాంత్ కిషోర్‌కు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఏటా వివిధ పార్టీలు, వ్యక్తులతో ఆయన పనిచేస్తుంటారని, ఆయన మీ డేటా తీసుకుని మరొకరికి ఇస్తారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదు, ఆయనకు కాషాయ పార్టీ భావజాలం ఉందని పేర్కన్నారు. బీజేపీ సిద్ధాంతాన్ని ప్రశాంత్ కిషోర్ అనుసరిస్తారని, రాజకీయ వ్యూహంలో భాగంగా బీజేపీ ఆయనకు నిధులు సమకూరుస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు.