
Kolkata, May 24: ఈ సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) ఓడిపోతామని బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamatha Benarjee) విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) తనను తాను దేవుడు పంపిన దూతగా చెప్పుకోవడంపై కూడా బెంగాల్ సీఎం మండిపడ్డారు. శుక్రవారం సుందర్‌బన్ ప్రాంతంలోని మథురాపూర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న మమత.. కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘తాము దేవుడు పంపిన దూతలమని కొందరు ప్రకటించుకుంటున్నారు. అలాంటివారు ప్రజలను అల్లర్లకు పురికొల్పడం, ప్రకటనల ద్వారా తప్పులు ప్రచారం చేయడం, ఎన్‌ఆర్‌సీ (NRC) చేపట్టి ప్రజలను జైల్లో వేయడం, పనికి ఆహార పథకం నిధులను నిలిపివేయడం, ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చి వెనక్కితగ్గడం లాంటి పనులు చేస్తారా..?’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి మమత ప్రశ్నించారు.
పూరీ జగన్నాథుడిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మమతా దీదీ మండిపడ్డారు. కాగా ఇటీవల ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ.. ‘మాతృమూర్తి చనిపోయిన తర్వాత ఓసారి వెనక్కి తిరిగి చూసుకున్నా. నన్ను దేవుడు పంపించి ఉండవచ్చు అని అనుకున్నా. ఈ బలం నా శరీరానిది కాదు. నేను దేవుడు పంపిన సాధనం కంటే మరోటి కాదు’ అని పేర్కొన్నారు.