Nallu Indrasena Reddy: తెలంగాణ బీజేపీనేతకు గవర్నర్ పదవి, త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్ దాస్ నియామకం
ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపురతో పాటు ఒడిశా రాష్ట్రంకు నూతన గవర్నర్ ను నియమించారు. ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ ను (Raghubardas) నియమించారు.
New Delhi, OCT 19: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) త్రిపుర గవర్నర్ గా నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపురతో పాటు ఒడిశా రాష్ట్రంకు నూతన గవర్నర్ ను నియమించారు. ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ ను (Raghubardas) నియమించారు. ఇంద్రసేనారెడ్డి నాలుగు దశాబ్దాలకుపైగా బీజేపీలోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు తగిన గౌరవం లభించడంపట్ల తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్రిపుర గవర్నర్ గా నియామకం పట్ల ఇంద్రసేనారెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలువురు బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయల తరువాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్ గా (Governor Of Tripura) బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతలు గవర్నర్లు గా పనిచేస్తున్నారు. మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు కొనసాగుతున్నారు. హరియాణా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ఉన్నారు. తాజాగా ఇంద్రసేనా రెడ్డి త్రిపుర గవర్నర్ గా నియామకం అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉండటం గమనార్హం.
నల్లు ఇంద్రసేనారెడ్డికి బీజేపీతో 40ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా బీజేపీలోనే ఉంటూ ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, గానుగబండ గ్రామంలో 1953లో ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy) జన్మించారు. ఆయన ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాకూడా పనిచేశారు. మూడుసార్లు (1983, 1985, 1999 సంవత్సరాల్లో) మలక్ పేట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1989, 1994) ఓడిపోయారు. 2003 నుంచి 2007 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.