Telangana: వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు
అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో సీఎం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
Hyd, Oct 15: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో సీఎం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ అంశంపై వివాదం మరింత చెలరేగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియా ముందుకు వచ్చి మూసీ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని సీఎం తెలిపారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటి వారికి మెరుగైన జీవితం అందించాలని భావిస్తున్నామన్నారు. విద్యావంతుల నుంచి నిరక్ష్యరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలన్నారు సీఎం.
గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేశారని.. గత ప్రధానులు సంస్కరణలు తెచ్చిన ప్రతిసారీ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందని సీఎం గుర్తు చేశారు. 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీపై పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు ఎప్పుడూ ఉంటారని అన్నారు.
CM Revanth Reddy Press Meet Videos
పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం అని చెప్పారాయన. కొందరి మెదడులో మూసీలో ఉన్న మురికి కంటే.. ఎక్కువ విషం నింపుకున్నారంటూ విపక్ష నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విషపూరిత ఆలోచనలతోనే మూసీ ప్రాజెక్ట్‌పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా సీఎం పేర్కొన్నారు. మల్లన్నసాగర్, వేములఘాట్‌లో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి.. తాము పేదలను ఖాళీ చేయించటం లేదని సీఎం తెలిపారు. రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా తాను వస్తానని సీఎం రేవంత్ అన్నారు. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి.. మెరుగైన జీవితం ఇవ్వాలనే ఈ ప్రాజెక్ట్ తలపెట్టామన్నారు.
మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను సీఎం వెల్లడించారు. ‘‘మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదు. దాదాపు 300 కి .మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. మేం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం. కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు. మెదడులో విషం నింపుకొని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు.
హైడ్రా కూల్చివేతలపై కూడా సీఎం స్పందించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నారు. మూసీ ప్రాజెక్టుపై తన తప్పును నిరూపించేందుకు విపక్ష నేతలకు ఇదే మంచి అవకాశమన్నారు. బుల్డోజర్లు తమ మీద నుంచి పోనీయాలని పోటీ పడటం కాదు... కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ మూసీ పరీవాహక ప్రాంతంలోనే మూడు నెలలు ఉండి... అక్కడి జీవితం బాగుందని చెప్పాలన్నారు. వాళ్లు అక్కడ ఉంటామని చెబితే అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వారు అక్కడ ఉంటే కనుక తాను వారి ఆరోపణలను ఖండించకుండా... ప్రాజెక్టును రద్దు చేస్తానని సవాల్ చేశారు. అవసరమైతే తన సొంత ఆస్తి అమ్మి ప్రభుత్వానికి నష్టం లేకుండా చేస్తానన్నారు.
మూసీ ప్రక్షాళనపై ఏమైనా అనుమానాలు ఉంటే శనివారం లోగా తమకు పంపించాలని సూచించారు. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు తాను ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నానని... మూసీపై అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా పంపించాలన్నారు. సమాధానం చెప్పాకే ముందుకు వెళతామన్నారు. వికారాబాద్ జిల్లాలో రాడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. దేశ భద్రతను రాజకీయాలతో ముడి పెట్టవద్దని సూచించారు. కొన్ని విషయాలను దేశభద్రత కోణంలో చూడాలని కోరారు. దేశభక్తి లేనివాడు కసబ్ కంటే హీనుడు అని మండిపడ్డారు. కేటీఆర్ కసబ్‌లా మారుతామంటే తమకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నారు.