CM KCR in Aurangabad: మహారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటింటికి తాగు నీరు, ప్రతి ఎకరాకు సాగునీరు
ఈ సందర్భంగా పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి.
Aurangabad, April 24: మహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన BRS బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ‘‘ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా? దేశం పురోగమిస్తోందా.. తిరోగమిస్తోందా? ఆలోచించండి.
ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా.. చెప్పండి. నా మాటలు విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర పవిత్ర భూమికి నమస్కారం. అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలను విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులతో చర్చించండి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే అంశంపై చర్చ పెట్టండని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇప్పటికీ సాగు, తాగు నీరు అందడం లేదు. సాగు, తాగు నీరు అందకపోవడం ఎవరి పాపం? ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందట్లేదు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా వంటి నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలెందుకు..? ముంబై దేశ ఆర్థిక రాజధాని, కానీ తాగేందుకు నీళ్లుండవా..? దేశం పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..? ఆలోచించండి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది.. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
ఔరంగాబాద్, అకోలలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారికి తాగునీటి సమస్య కనిపించడం లేదా..? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా..? ఇంటికి పంపించాలా..? అనే విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత ఆలోచించండి. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది..? లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.
దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదు.. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంది. పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు ఆకాంక్ష గెలవడం ముఖ్యం. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉంది. ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడుతాం. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కూనరిల్లుతుంది. చైనా ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరింది. సింగపూర్, కొరియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి.
దేశ ప్రజల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. పోరాటంలో నిజాయితీ ఉంటే విజయం దానంతట అదే సిద్ధిస్తుంది. దేశంలో మార్పు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తాం. అదేదో కిరాయి ఆఫీసుల్లో కాదు.. స్వతహాగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మిస్తాం.
మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఐదేండ్లలోనే ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగేనీటినే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు ప్రజలు కూడా తాగుతున్నారు. ఇక్కడ కూడా ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ఉచిత కరెంట్ ఇస్తాం. రైతులను ఆదుకుంటాం. తాగేందుకు నీరు లేదు.. యువతకు ఉద్యోగాల్లేవు. కావాల్సిన దాని కంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉంది.
కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్‌పై నమ్మకం ఉంచండి. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించలేదు. దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పడింది. మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది. అన్ని వర్గాల వారికి సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకు వెళ్లదు. మార్పును తీసుకు వచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టింది.
తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. సాగునీరు అందిస్తున్నాం. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో ప్రతీ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నాం. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. మరి మహారాష్ట్రలో ఇవి ఎందుకు అమలు కావడం లేదు. ఇంకెంతకాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి. కాబట్టి ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.
కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను. మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చేయ్.. 24 గంటల కరెంట్ ఇవ్వండి. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేద్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా..? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు. నూతనంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి.
మేకిన్ ఇండియా అంటారు.. నగరంలో వీధి వీధికో చైనా బజార్ ఉంటది. డిజిటల్ ఇండియా మజాక్ అయింది.. మేకిన్ ఇండియా జోక్ అయింది. మహారాష్ట్రలో మంత్రులు కేబినెట్ ఉంటుంది.. కానీ చీఫ్ సెక్రటరీ ఎందుకు ఉండరు..? పెద్ద రాష్ట్రమని చెప్పుకునే మహారాష్ట్రలో చీఫ్ సెక్రటరీ ఉండరా..?అని ప్రశ్నించారు.