COVID-19 Victim's Funeral: కరోనా మరణం.. కడసారి చూసుకోలేని దైన్యం! కరోనా ద్వారా మరణించిన వ్యక్తికి కేవలం ఒక్క వ్యక్తితోనే పూర్తైన అంత్యక్రియలు, మృతుడి కుటుంబ సభ్యులంతా అంతా క్వారైంటైన్ లోనే
గతంలో కలరా, ఎబోలా మరియు మార్ బర్గ్ లాంటి వ్యాధుల బారిన పడి చనిపోయిన వారిని ఖననం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన మార్గనిర్ధేషకాలను విడుదల చేసింది. అయితే కరోనావైరస్ కొత్తది కావడంతో....
Hyderabad, March 31: తెలంగాణలో నమోదైన తొలి కరోనావైరస్ మరణం (COVID-19 Death) , 74 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలు సోమవారమే పూర్తయ్యాయి. అయితే ఇతడి అంత్యక్రియలకు కుటుంబం నుంచి కేవలం ఒక్కరు మాత్రమే హాజరు కాగలిగారు. మృతుడికి సంబంధించిన మిగతా కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం నిర్బంధం (Quarantine) లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది కలిసి మృతుడి రక్త సంబంధీకుడి సమక్షంలో ఖైరతాబాద్ లో గల స్మశానవాటికలో శవాన్ని ఖననం చేశారు.
బాధితుడు మార్చి 14న దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి (Nizamuddin Markaz Jamaat) హాజరై 3 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాడు. అనంతరం జ్వరం, జలుబుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయినప్పటికీ బాధితుడి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, కరోనావైరస్ తో చనిపోయినట్లు నిర్ధారణ అయింది.
ఇదిలా ఉంటే, ఈ కరోనావైరస్ బారినపడి మరణించిన వారిని ఎలా ఖననం చేయాలనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి మార్గనిర్ధేషకాలు లేవు. గతంలో కలరా, ఎబోలా మరియు మార్ బర్గ్ లాంటి వ్యాధుల బారిన పడి చనిపోయిన వారిని ఖననం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన మార్గనిర్ధేషకాలను విడుదల చేసింది. అయితే కరోనావైరస్ కొత్తది కావడంతో మృతదేహాల ఖననం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సందిగ్థత నెలకొంది. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మృతుడి శరీరంలో కరోనావైరస్ వృద్ధి చెందుతుందా? కరోనా వ్యాధిగ్రస్త మృతదేహాల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందా? అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఏదైమైనా దీని విషయంలో మార్చి 24న WHO కొన్ని సూచనలైతే చేసింది. కరోనావ్యాధిగ్రస్తుల మృతదేహాల ద్వారా మళ్ళీ వైరస్ వ్యాప్తి చెందకుండా ఖననం చేసే విషయంలో "సురక్షితమైన" విధానాలను పాటించాల్సిందిగా సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఖననం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. WHO నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చేంతవరకు ఇదే విధానం కొనసాగనుంది.
తెలంగాణలో చనిపోయిన మొదటి కోవిడ్-19 మృతుడి విషయంలో కూడా ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని అనుసరించే ఖననం పూర్తి చేశారు. అంత్యక్రియలకు అతి కొద్ది మంది మాత్రమే హాజరై, సామాజిక దూరాన్ని, ఇతర సురక్షితమైన జాగ్రత్తలు పాటిస్తూ, ఒక లోతైన గుంత తవ్వి మృతుడిని పాతిపెట్టారు. గుంతలో మృతదేహంపైన క్రిమిసంహారక మందులు చల్లిన అనంతరం పూడ్చివేశారు.