Malavath Poorna: మాలావత్‌ పూర్ణ మరో రికార్డు, ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసిన తెలుగు తేజం, యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియాగా రికార్డు

ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది.

Malavath Poorna on the top of Mt. Vinson Massif | Photo: Twitter

Hyd, june 8: తెలుగుతేజం చెందిన మాలావత్‌ పూర్ణ (Malavath Poorna) అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (Mt Denali) (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది.

పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో (highest peak in North America) పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు. మే 23న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ (Malavath poorna summits) ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్‌ శేఖర్‌ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్‌ చేసిన ఏస్‌ ఇంజనీరింగ్‌ అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌(వీఆర్‌ఎస్‌), సహకరించిన హైదరాబాద్‌ బీఎస్‌బీ ఫౌండేషన్‌ చైర్మన్‌ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది.

శిఖరం కంటే ఎత్తైనది ఆమె ఘనత! చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ, అంటార్కిటిక ఖండంలోని ఎత్తైన శిఖరం అధిరోహణ, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను జయించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్

పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్‌ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్‌ వర్మ కూడా ఉన్నారు. పూర్ణ 2014లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్‌ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది.

పూర్ణ అధిరోహించిన ఏడు పర్వతాలు:

1. ఎవరెస్టు (ఆసియా)

2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా)

3. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (యూరప్‌)

4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)

5. మౌంట్‌ కార్టెన్జ్‌ (ఓషియానియా)

6. మౌంట్‌ విన్‌సన్‌ (అంటార్కిటికా)

7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా)