Malavath Poorna: శిఖరం కంటే ఎత్తైనది ఆమె ఘనత! చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ, అంటార్కిటిక ఖండంలోని ఎత్తైన శిఖరం అధిరోహణ, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను జయించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్
Malavath Poorna on the top of Mt. Vinson Massif | Photo: Twitter

Hyderabad, January 1:  తెలంగాణ (Telangana) లోని నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన పల్లె పాకాల గ్రామానికి చెందిన మలావత్ పూర్ణ (Malavath Poorna) అంటార్కిటికా ఖండంలో గల అత్యంత ఎత్తైన విన్సన్ మాసిఫ్ ( Mt. Vinson Massif) పర్వత శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. 16,050 అడుగుల ఎత్తు లేదా 4,987 మీటర్ల ఎత్తు ఉండే ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలలో ఒకటి. డిసెంబర్ 26, 2019న మలావత్ పూర్ణ ఈ ఘనత సాధించింది. 18 ఏళ్ల పూర్ణ ఇప్పటివరకు ప్రపంచంలోని 6 ఖండాలలో ఎత్తైన శిఖరాలన్నింటిని జయించింది. ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి మరియు అతిచిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. 7 ఖండాలలోని ఎత్తైన శిఖరాలన్ని జయించటమే తన లక్ష్యం అని పూర్ణ పేర్కొంది.

ఒక మారుమూల గ్రామంలో చిన్నచిన్న కొండలను ఎక్కడంతో ప్రారంభమైన మలావత్ పూర్ణ ప్రస్థానం నేడు ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలన్నింటిని జయించే స్థాయికి చేరింది.

ఇప్పటివరకు, పూర్ణ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) 2014లో అధిరోహించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మౌంట్. కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019) మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా ప్రాంతం, 2019) మరియు మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) శిఖరాలను వరుసగా జయించింది. ఇక ఇప్పుడామే మిగిలిన, ప్రపంచంలోని ప్రతి పర్వతారోహకుడి కలగా చెప్పబడే ఉత్తర అమెరికాలోని ఎత్తైన దేనాలి శిఖరాన్ని కూడా అధిరోహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

ఇన్ని మైలురాళ్లు సాధించడం పట్ల మలావత్ పూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. తనకు మొదటి నుంచి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులు మరియు కోచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మద్ధతునే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొంది.

నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన పూర్ణ, ప్రస్తుతం గ్లోబల్ అండర్గ్రాడ్యుయేట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కింద అమెరికాలోని మిన్నెసోటా స్టేట్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసిస్తున్నారు.