Tirupati Laddu Dispute: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.

Tirupati Laddu (photo-X)

Vjy, Sep 24: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.

ఇక త్వరలోనే టీటీడీ పాలకమండలి(TTD Board) నియామకం జరుగుతుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramnarayana Reddy) వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.

వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. లడ్డు వివాదంతో పాటు తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను, నాణ్యతను పరిశీలించాకే వినియోగించాలని ఆలయ అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.