Jagan Cancels Tirupati Visit: జగన్ తిరుమల పర్యటన రద్దు, తిరుపతి పర్యటన పూర్తి వివరాలపై కాసేపట్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్న వైసీపీ అధినేత

ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు.

YS Jagan Mohan Reddy (photo-X/YSRCP)

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి.

మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా...? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జగన్ తిరుమల పర్యటన, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్, తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 అమల్లోకి, ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకుంటారా అంటూ భూమన ఆగ్రహం

కాసేపట్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో తిరుమల పర్యటన రద్దుపై వైఎస్‌ జగన్‌ మాట్లాడే అవకాశం ఉంది. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనకు ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, హౌజ్‌ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలనూ వేధింపులకు గురి చేస్తోంది. చుట్టుపక్కల జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు.

మరోవైపు.. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు, వైఎస్సార్‌, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్భంధం కొనసాగుతోంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి ఇంటిని వేకువ జామునే చుట్టుముట్టిన పోలీసులు.. జగన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు.



సంబంధిత వార్తలు