YS jagan vs Chandrababu and Tirumala (Phoot-Wikimedia Commons)

Tirupati, Sep 27: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల‌ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌ జరిగింది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆదోనిలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్‌ తిరుపతి వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. నేటి నుండి నెల రోజుల పాటు తిరుమల వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు.

తిరుమలకు వెళ్లకూడదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు తీసుకుని కడపలోని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా నివాసానికి పోలీసులు వెళ్లారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడానికి మీరెవరూ అంటూ పోలీసులను నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తిరుమల వైఎస్‌ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దేహం పెరిగినట్టుగా బుద్ధి పెరగలేదు నీకు, నీ కుల పార్టీలోకి నేను రావడమా అంటూ అచ్చెన్నాయుడిపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి

వైఎ‍స్సార్‌సీపీ నేతలకు నోటీసుల పేరుతో ఈ రాద్ధాంతం దేనికి?. సెక్షన్‌-30 పేరుతో పార్టీ నేతలకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు. వంద రోజుల పాలనలో హామీలు అమలు కాలేదని డైవర్షన్‌ కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అంటూ వైసీపీ పార్టీ కామెంట్స్‌ చేసింది.ఏపీలో తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ స్పందిస్తూ.. ‘స్వార్థ రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు దేవుడిని వాడుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకే డిక్లరేషన్‌ పేరుతో డ్రామాకు తెరలేపారు. వైఎస్‌ జగన్‌ మొదటిసారి తిరుమలకు వెళ్లడం లేదు. పాదయాత్రకు ముందు కూడా తిరుమల వెళ్లారు. సీఎం హోదాలో శ్రీవారికి వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరునామాలతో స్వామి వారి సేవలో పాల్గొన్న వారికి ఇప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడింది.

తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు

ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది.. ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా?. జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

‘‘మా పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జగన్‌ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోంది. వైఎస్‌ జగన్‌పై నీచాతినీచంగా రాజకీయ దాడికి దిగుతున్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్‌ను కట్టడి చేయాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వైఎస్‌ జగన్‌పై గతంలో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? అంటూ భూమన ప్రశ్నించారు.

‘‘చంద్రబాబూ.. ఇకనైనా మీ రాజకీయాలు ఆపండి. మీరు ఎంత నిర్బంధానికి గురిచేస్తే అంతగా పైకి లేస్తాం. మీ పాపపు పాలనపై ప్రజా పోరాటం చేస్తాం. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండి. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు. చంద్రబాబూ మీరొక మాట.. పవన్‌ మరో మాట మాట్లాడతారు. చంద్రబాబు శిష్యులు జగన్‌ను రానివ్వం అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీజేపీ నేతలు డిక్లేరేషన్‌ కోసం భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు’’ అంటూ కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 27, 28 రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్న సంగతి విదితమే. పర్యటనలో భాగంగా నేటి (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.అనంతరం తిరుమల నుంచి తిరుగుపయనమవుతారు.

ఇక వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24 తేదీ వరకు సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని అన్నారు.

ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ఈ శనివారం(సెప్టెంబర్‌ 28) ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.