Tirumala: కోవిడ్19 దృష్ట్యా శ్రీవారి దర్శనం టికెట్లను తగ్గించిన టిటిడి పాలకమండలి, పరిస్థితి తీవ్రమైతే ఇప్పుటికే బుక్ అయినవి కూడా రీషెడ్యూల్, కరోనా లక్షణాలుంటే భక్తులు తిరుమల రావొద్దని సూచన
అలాగే తిరుమల లేదా తిరుపతిలోని భక్తులకు కేటాయించే వసతి గృహాల్లో ఒక గదిలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వసతి కల్పించాలని టిడిపి నిర్ణయించింది. తిరుమల వచ్చే అన్ని వాహనాలకు....
Tirumala- Tirupathi, March 31: కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉచిత దర్శన్ (సర్వ దర్శనం) టోకెన్ల సంఖ్యను తగ్గించారు. సాధారణంగా ప్రతిరోజూ 22,000 వరకు జారీ చేసే సర్వ దర్శన్ టోకెన్ల సంఖ్యను 15,000 కు తగ్గించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. అలాగే ఏప్రిల్ నెలకు గానూ రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లకు సంబంధించి ఇప్పటికే 25 వేల దర్శన స్లాట్లు బుక్ అయ్యాయి. పరిస్థితిని మరోసారి సమీక్షించిన తరువాత, స్లాట్లు రద్దు చేయడం లేదా మే- జూన్ నెలలకు వాయిదా వేయాలని భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు తమకు కేటాయించిన దర్శన స్లాట్‌కు అరగంట ముందు మాత్రమే వైకుంఠం కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని, భక్తులు ఇది గమనించాలని టిటిడి అధికారులు కోరారు.
ఏప్రిల్ 1 నుండి అన్ని రకాల దర్శన టికెట్లను కలిపి ప్రతిరోజూ కేవలం 45 వేల మందికే స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు.
తిరుమల వచ్చే భక్తుల కోసం నూతన కోవిడ్ మార్గదర్శకాలను టిటిడి విడుదల చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాదం భవన్, కళ్యాణ కట్ట తదితర ప్రదేశాలలో భక్తులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. వైకుంఠం క్యూకాంప్లెక్సులో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. దగ్గు, జలుబు మరియు జ్వరం లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తిరుమల రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఏప్రిల్ 14 నుండి నిర్వహించబోయే అర్జిత సేవల కార్యక్రమాలను కూడా టిటిడి పున: సమీక్షిస్తోంది. అలాగే తిరుమల లేదా తిరుపతిలోని భక్తులకు కేటాయించే వసతి గృహాల్లో ఒక గదిలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వసతి కల్పించాలని టిడిపి నిర్ణయించింది. తిరుమల వచ్చే అన్ని వాహనాలకు అలిపిరి వద్ద శానిటైజేషన్ కూడా ప్రారంభించారు. కాలినడకన వచ్చే భక్తులను ఉదయం 9 గంటల తరువాత అలిపిరి మరియు శ్రీవారిమెట్టు వద్ద అనుమతించనున్నారు. తిరుమల వచ్చే భక్తులు అన్ని ప్రదేశాలలో సామాజిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులు కోరుతున్నారు.