Ayodhya: మసీదు నిర్మాణం కోసం ముస్లిం వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆ స్థలం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముస్లిం సంఘాలు
పట్టణానికి చాలా దూరంలో భూమి కేటాయించటం పట్ల ముస్లిం పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ భూకేటాయింపును వారు తిరస్కరిస్తున్నారు....
Lucknow, February 6: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు, అయోధ్య (Ayodhya) సమీపంలోని ధన్నిపూర్ (Dhannipur) గ్రామంలో ఐదు ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
దశాబ్దాల తరబడి వివాదాస్పంగా కొనసాగిన అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలం పూర్తిగా హిందూ పక్షాలకే చెందుతుందని గతేడాది నవంబర్ 09న సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పును వెలువరించింది. అందుకు ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్య పట్టణంలోనే మరో చోట మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం ప్రభుత్వమే కేటాయించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
ఇప్పటికే అయోధ్యలో రామమందిర (Ram Temple) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ముస్లిం వక్ఫ్ బోర్డుకు కూడా మసీదు (Mosque) నిర్మాణం కోసం 5 ఎకరాలు యూపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింది. ఈ స్థలం, రామమందిరం నిర్మాణం జరిగే స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఫైజాబాద్ జిల్లా కేంద్రం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామ మందిర నిర్మాణంపై లోక్ సభలో కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య జిల్లా, సోహవాల్ తహసీల్ పరిధిలోని ధన్నిపూర్ గ్రామంలో ఉన్న ఈ ప్లాట్లు లక్నో-గోరఖ్పూర్ హైవేకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నాయి, కాబట్టి మసీదుకు సులభంగా చేరుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇక్కడ స్థలం కేటాయించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారి ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు.
అయితే ఈ స్థలం పట్ల ముస్లిం పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రదేశం అయోధ్య పట్టణానికి చాలా దూరంలో ఉంది, ప్రార్థనలు చేసుకోడానికి ఏ ముస్లిం కూడా అంతదూరం వెళ్లడు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా, అయోధ్య పట్టణంలోనే భూమి ఇవ్వాలి అని వారు తమ వాదన వినిపిస్తున్నారు.
అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఈ ధన్నిపూర్ గ్రామం, రామ్ మందిరం ఏర్పాటయ్యే స్థలానికి 14 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉందంటూ, పట్టణానికి చాలా దూరంలో భూమి కేటాయించటం పట్ల ముస్లిం పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ భూకేటాయింపును వారు తిరస్కరిస్తున్నారు.