Uttarakhand Rains: జల విలయంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్, 40 మంది మృతి, మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం, ఇండ్లు కూలిపోయిన వారికి రూ. 1.9 లక్షల చొప్పున సాయం
గత మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు (Uttarakhand Rains) రాష్ట్రంలో పెను ఉత్సాతాన్ని సృష్టంచాయి. ఆగ్నేయ గాలుల కారణంగా కురిసిన అత్యంత భారీ వర్షాలతో పర్వతాల నుంచి మైదానాల వరకు పెను విధ్వంసం (Heavy Rainfall Causes Flooding and Landslides) కలిగింది.
Dehradun, October 20: ఉత్తరాఖండ్ భారీ వర్షాలకు వణికిపోతోంది. గత మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు (Uttarakhand Rains) రాష్ట్రంలో పెను ఉత్సాతాన్ని సృష్టించాయి. ఆగ్నేయ గాలుల కారణంగా కురిసిన అత్యంత భారీ వర్షాలతో పర్వతాల నుంచి మైదానాల వరకు పెను విధ్వంసం (Heavy Rainfall Causes Flooding and Landslides) కలిగింది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి పలు వంతెనలు కొట్టుకుపోగా రైల్వేలైన్లు దెబ్బతిన్నాయి. పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వానలు, వరదల వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో మంగళవారం ఒక్కరోజే 37 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కు చేరింది. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌కు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ మూసుకుపోయాయి. జిల్లా కేంద్రం నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నైనీ సరస్సు ఉప్పొంగడంతో.. ఒడ్డున ఉన్న నైనాదేవి ఆలయంతో పాటు మాల్ రోడ్డు వరదనీటిలో పూర్తిగా మునిగిపోయింది. వరదనీటిలో చిక్కుకున్న వారికి సహాయం అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్, మూడు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయని సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని, ఇండ్లు కూలిపోయిన వారికి రూ. 1.9 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు.
దేశాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు, కేరళలో 10 డ్యామ్‌లకు రెడ్ అలర్ట్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు
వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, పర్యాటకులెవ్వరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరాతీశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ధామి, కేంద్రమంత్రి అజయ్‌భట్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ భారీ వర్షాలకు 100 సంవత్సరాల క్రితం నమోదైన రికార్డులూ బద్దలయ్యాయి. కుమావన్ ప్రాంతంలోని ముక్తేశ్వర్‌లో 107 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 18, 1914 న 254.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్‌లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపావత్‌లో 580 మి.మీ, నైనిటాల్‌లో 530 మి.మీ, జియోలికోట్ 490 మి.మీ, భీమ్‌టాల్ 400 మి.మీ, హల్ద్వానీలో 300 మి.మీ వర్షపాతం రికార్డయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. 1990 జూలై 10న పంత్‌నగర్‌లో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, గత 24 గంటల్లో పంత్‌నగర్‌లో 403.9 మిల్లీమీటర్ల రికార్డయిందన్నారు. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 1.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేయగా..122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పాశ్చాత్య అవాంతరాలు, ఆగ్నేయ గాలులు హిమాలయ ప్రాంతమైన లడఖ్, హిమాచల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ తజికిస్తాన్ ప్రాంతాలను కలిపే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో అక్టోబర్ 22 నుంచి 23 వరకు రెండు రోజుల పాటు పాశ్చాత్య, ఆగ్నేయ గాలులు పూర్తిగా చురుగ్గా ఉంటాయి. ఫలితంగా, ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం, మంచు కురుస్తుంది.
కేరళలో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న కేరళలో రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో 6-20 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని అంచనా వేసింది. వరదలతో ఇడుక్కి, పంబా, కక్కీతో పాటు మరో 78 జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ఒడిశాలో కూడా ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్షాలు
మరోవైపు, ఒడిశాలో కూడా ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో మత్స్యకారులెవ్వరూ బంగాళాఖాతంలోకి చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. ఉత్తర ఒడిశాలోని సువర్ణరేఖ, బుధాబలంగ్, జలక నదులు ఉప్పొంగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్, బెంగాల్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా వర్షాల కారణంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో యూపీలో నలుగురు మృతిచెందారు.