Nainital, Oct 19; ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు (Uttarakhand Landslides) విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు, కాన్పూర్‌కు చెందిన పర్యాటకుడితో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. భారీ వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో.. నైనిటాల్ కు రాకపోకలు (cuts off Nainital road links) ఆగిపోయాయి.
కేదర్‌నాథ్ టెంపుల్‌కు వెళ్లి వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. 55 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉండటంతో అతన్ని స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. నందాకిని రివర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బద్రీనాథ్ నేషనల్ హైవేకు సమీపంలోని లాంబగడ్ నల్లాహ్ వద్ద వరదలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. భారీవర్షాల కారణంగా ఛార్‌దామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు, మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు (Madhya Pradesh Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భారీ వర్షాలు కేరళను (KeralaRains) అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు సముద్రాలను తలపిస్తున్నాయి. పతనంతిట్ట, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాల్లోని పది డ్యామ్‌లలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద ప్రవాహం పెరుగడంతో కక్కి డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో పంపా నదిలో నీటి మట్టం పెరుగొచ్చని.. కాబట్టి, శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులను తాత్కాలికంగా అనుమతించడం లేదని పేర్కొన్నారు.